ఇదే ఇక్కడి శివయ్య విశేషం !
భక్తులను అనుగ్రహించడం కోసం ... వాళ్ల బాధలను తీర్చడం కోసం పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఆయన కొలువుదీరిన క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన్నే సకల శుభాలు చేకూరతాయి. అందరినీ ఆదుకునే ఆ సదాశివుడు, ఆయా క్షేత్రాల్లో వివిధ నామాలతో పిలవబడుతూ వుంటాడు.
స్థల మహాత్మ్యాన్ని బట్టి ... ప్రతిష్ఠించినవారినిబట్టి కూడా స్వామివారు ఆయా నామాలతో కొలవబడుతూ వుంటాడు. ఆ దేవదేవుడు కొలువైన విశిష్టమైన క్షేత్రాల్లో 'తాడిపత్రి' ఒకటిగా కనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో గల ఈ ఊళ్లో 'బుగ్గ రామలింగేశ్వరస్వామి' దర్శనమిస్తూ ఉంటాడు. పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక పురాణపరమైన కారణం కనిపిస్తుంది.
ఒకానొక సందర్భంలో శ్రీరాముడు 'తాటకి' అనే రాక్షస స్త్రీని సంహరిస్తాడు. ఆ పాపం నుంచి విముక్తిని పొందడం కోసం ఆయన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. రాముడిచే ప్రతిష్ఠించబడిన కారణంగా ఇక్కడి స్వామి రామలింగేశ్వరుడుగా పిలవబడుతున్నాడు. ఇక ఈ పేరుకు ముందు 'బుగ్గ' అనేది ఎలా వచ్చిందనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది.
ఇక్కడి శివలింగం క్రింది భాగం నుంచి నిరంతరం సన్నని నీటిధార బయటికి వస్తూనే వుంటుంది. ఇలాంటి నీటి ఊటలను ఈ ప్రాంతంలో 'బుగ్గలు' అని పిలుస్తుంటారు. అలాంటి నీటి ఊటను కలిగిన రామలింగేశ్వరుడు కనుక, బుగ్గ రామలింగేశ్వరుడుగా కొలవబడుతున్నాడు. కొండంత దేవుడిగా అండగా నిలిచి కోరిన వరాలను ప్రసాదిస్తున్నాడు.
ఒక వైపున పౌరాణిక నేపథ్యాన్నీ ... మరోవైపున చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ వుంటుంది. దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆనందానుభూతులను కలిగిస్తూ ఉంటుంది.