ఈ ఆలయంలో ఇదో ఆచారం !

సాధారణంగా దేవాలయానికి వెళ్లినప్పుడు మనసులోని కోరికను భగవంతుడికి చెప్పుకుంటూ వుంటారు. తమ కోరికను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చమని విన్నవించుకుంటూ వుంటారు. అలా భగవంతుడిపై దృష్టి నిలిపి మనసులోని మాటను చెప్పుకుంటూ వుండగా, స్వామివారికి అలంకరించబడిన పుష్పాల్లో నుంచి ఒకటి ఒక్కోసారి కిందపడుతూ వుంటుంది.

అలా జరిగినప్పుడు స్వామి తమ కోరికను నెరవేర్చడానికి అంగీకరించినట్టుగా భావించడం జరుగుతూ వుంటుంది. అర్చకుడిని అడిగి ఆ పువ్వును తీసుకుని సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతూ వుంటారు. భగవంతుడికి అలంకరించబడిన పుష్పాలలో నుంచి ఒక పువ్వు రాలిపడితే ఆయన అనుగ్రహం లభించినట్టుగా విశ్వసించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది.

అలాంటి పద్ధతి ఆచారంగా మారిన తీరు మనకి నెల్లూరు జిల్లా పరిధిలో గల 'సిద్ధులకొండ' లో కనిపిస్తుంది. ఈ కొండపై గల గుహలో నవనాథ సిద్ధేశ్వరులు దర్శనమిస్తూ వుంటారు. ఇక్కడ వీరు ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా వుంటుంది. అనేక విశేషాలకు ... మహిమలకు నెలవైనదిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందిది. మంత్రపుష్పం అనంతరం భక్తులు తమ మనసులోని కోరికను నవనాథ సిద్ధేశ్వరులకు చెప్పుకుని వారి మూర్తులపై ఒక్కో పువ్వును ఉంచుతారు.

ఏ పువ్వు కిందపడినా తమ కోరికను నెరవేర్చడానికి వాళ్లు అంగీకరించారని భక్తులు భావిస్తుంటారు. విగ్రహం పైనుంచి పువ్వు కిందపడకపోతే, మరోసారి దర్శనానికి అనుమతిని ఇవ్వమని కోరుతూ అక్కడి నుంచి సెలవు తీసుకుంటూ వుంటారు. కొత్తగా చూసే వాళ్లకి ఇది చిత్రంగా అనిపించినా, ఇలా పువ్వు రాలి కిందపడటం వలన వెంటనే కోరిక నెరవేరినవాళ్లు ఎంతో మంది ఇక్కడ కనిపిస్తుంటారు. వాళ్ల అనుభవాలు ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి ... ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని ఆవిష్కరిస్తూ వుంటాయి.


More Bhakti News