ఈ శివలింగం గుండ్రంగా తిరిగేదట !
లోక కల్యాణం కోసం పరమశివుడు కాలకూట విషాన్ని కంఠంలో దాచుకున్నాడంటే ఆయనది ఎంతటి చల్లని మనసో అర్థంచేసుకోవచ్చు. అలాంటి ఆదిదేవుడు ఆవిర్భవించిన ఒక్కో క్షేత్రం ఒక్కో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇంతటి ప్రత్యేకతను సంతరించుకున్న సదాశివుడి ఆలయాలలో ఒకటిగా విశాఖ జిల్లాకి చెందిన 'చోడవరం' కనిపిస్తుంది.
చోళరాజుల ఏలుబడిలో వుండటం వలన 'చోళవరం'గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, కాలక్రమంలో 'చోడవరం'గా పిలవబడుతోంది. గంగా గౌరీ సమేతంగా పరమశువుడు దర్శనమిస్తూ ఉండటం ఇక్కడి విశేషం. ఇక ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేవిటంటే, ఈ స్వయంభువు శివలింగం బయటపడిన రోజునే, ద్వారపాలకులతో సహా నందీశ్వరుడు మరోచోట బయటపడటం.
నిజంగా ఇది స్వామివారి మహిమేనని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఇక ఈ క్షేత్రానికి దగ్గరలోని మరో ప్రదేశంలో కూడా స్వయంభువుగా చెప్పబడుతోన్న మరో శివలింగం కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని 'లింగాల తిరుగుడు' గా పిలుస్తుంటారు. ప్రాచీన కాలం నుంచి కొంతకాలం క్రితం వరకూ ఈ శివలింగం ఉన్నచోటు నుంచి కదలకుండా గుండ్రంగా తిరుగుతూ ఉండేదని ఇక్కడి వృద్ధులు చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు.
ఈ శివలింగం ఎలా తిరుగుతుందనేది ఎవరూ ఎలా కనుక్కోలేకపోయారో, ప్రస్తుతం అది ఎందుకు తిరగడం ఆగిపోయిందనేది కూడా ఎవరికీ తెలియదు. చోడవరం క్షేత్రానికి భక్తుల తాకిడి కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వచ్చిన భక్తులు తప్పని సరిగా 'లింగాల తిరుగుడు' ప్రదేశంలో గల సోమలింగేశ్వరస్వామిని కూడా దర్శించుకుంటూ వుంటారు. మహాదేవుడి మహిమలను తలచుకుని తరిస్తూ వుంటారు.