ఆ నాగుపాము అలా ప్రవర్తించిందట !

శ్రీ అక్కల్ కోటస్వామిని సాక్షాత్తు దైవ స్వరూపుడిగా భావించి అక్కడి ప్రజలు పూజిస్తూ వుండేవారు. ఆయన దర్శనభాగ్యం లభిస్తేచాలు ఆ క్షణంలోనే తమ కష్టాలు తొలగిపోతాయని ఆశించేవారు. ఆయన ఒకసారి తమవైపు చూస్తే చాలు, తమ సమస్య ఆయనకి అర్థమైపోయిందనీ, త్వరలోనే అది పరిష్కరించబడుతుందని విశ్వసించేవాళ్లు.

అనేక మందిని ఆపదల నుంచి రక్షించడం ... బాధల నుంచి బయటపడేయడమే కాదు, తన భక్తులలో కొందరికి పూర్వజన్మలోనే తనతో అనుబంధం వుందని చెప్పేవారు. ఇక కీటకాలు ... మూగజంతువులను సైతం ఆప్యాయంగా చేరదీస్తూ, ఆ జన్మని పొందిన ఫలానా వాళ్లతో తనకి గల అనుబంధాన్ని గురించి చెప్పేవాడు.

అక్కడి భక్తులు ఆ విషయాలను ఆసక్తికరంగా వింటూ తమని తాము మరిచిపోయేవాళ్లు. దైవ స్వరూపుడైన ఆయనని ప్రత్యక్షంగా దర్శించి సేవించే భాగ్యం లభించినందుకు సంతోషంతో పొంగిపోయేవాళ్లు. ఒకసారి అక్కల్ కోటస్వామి తన భక్తులతో కలిసి నడుస్తూ వుండగా, దారిపక్కనే గల ఒక పుట్టలో నుంచి ఒకపెద్ద నాగుపాము వచ్చిందట. దానిని చూసి అంతా భయంతో దూరంగా జరుగుతారు. ఆ నాగుపాము స్వామి పాదాలకి దగ్గరగా వచ్చి పడగ దింపి తలని నేలకి ఆనిచ్చి తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆ పాము అలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. అది గమనించిన స్వామి ... పోయిన జన్మలో తనకి తెలిసిన ఒక భక్తుడే కొన్ని కారణాల వలన అలా పాములా జన్మించాడనీ, పూర్వజన్మ వాసన ప్రభావం వలన తనని గుర్తించి దర్శనం చేసుకోవడానికి వచ్చాడని చెబుతాడు. ఇక అతను ఉత్తమమైన జన్మలు పొందుతాడని చెబుతూ అక్కడి నుంచి కదులుతాడు. ఆ మాటలకు అంతా ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తూ స్వామివారికి నమస్కరిస్తూ ఆయనని అనుసరిస్తారు.


More Bhakti News