ఆరోగ్యం వరంగా లభించే రోజు !
జీవితంలో వివిధ రకాల సమస్యలు ఎదురవుతూ వుంటాయి. అన్నిరకాల సమస్యలు ఒక ఎత్తయితే అనారోగ్య సమస్య మరోఎత్తు. ఆరోగ్యంగా వుంటే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కునే అవకాశం వుంటుంది. ఇక అనారోగ్యంతో వుంటే దాని బారి నుంచి బయటపడటమే ప్రధాన సమస్యగా కనిపిస్తూ వుంటుంది.
అందువలన తరచూ ఇలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఎవరికి తెలిసిన ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు. ఇక మందులు వాడటం వలన ప్రయోజనం లేదని భావించిన వాళ్లు భగవంతుడిపై భారం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో 'ధన్వంతరి'ని ప్రార్ధించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.
అసలు ఈ ధన్వంతరి ఎవరనే సందేహం కూడా కొంతమందికి కలుగుతుంటుంది. వైద్య విద్యకు ధన్వంతరి అధిదేవుడుగా చెప్పబడుతున్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ధన్వంతరిగా అవతరించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ వైకుంఠనాథుడే 'అమృత భాండం' పట్టుకుని పాలసముద్రం నుంచి ఆశ్వయుజ బహుళ 'త్రయోదశి' రోజున అవతరించాడు. అందువలన ఈ రోజున ధన్వంతరి జయంతిగా భావిస్తుంటారు.
ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరంలో ధన్వంతరి చిత్రపటాన్ని పూలమాలికలతో అలంకరించి, షోడశ ఉపచారాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. ధన్వంతరి పుట్టిన రోజున ఆయనని అంకితభావంతో పూజించడం వలన వివిధ రకాల వ్యాధులు నివారించబడి ఆరోగ్యం వరంగా అనుగ్రహించబడుతుందని చెప్పబడుతోంది.