రామలక్ష్మణుల తీర్థాలు ఇక్కడ చూడొచ్చు
వనవాస కాలంలో సీతారాములు తిరుగాడిన అనేక ప్రదేశాలు నేడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఇక సీతారాములు వనవాసానికి బయలుదేరడానికి ముందు ఒకానొక ప్రదేశాన్ని దర్శించారు. అదే 'ఒంటిమిట్ట' గా చెప్పబడుతోంది. ప్రస్తుతం కడప జిల్లా పరిధిలోగల ఈ ప్రదేశానికి త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వచ్చారట.
మహర్షుల ఆహ్వానాన్ని మన్నించి సీతారామలక్ష్మణులు ఇక్కడికి వచ్చారనీ ... అందుకు గుర్తుగా వాళ్లు ఇక్కడి రాతిపై సీతారామలక్ష్మణుల రూపాలను మలిచి ఆరాధించారని స్థలపురాణం చెబుతోంది. ప్రాచీనకాలంనాటి సీతారాముల ఆలయాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే రెండు కుండాలు కనిపిస్తూ వుంటాయి. వీటిని 'జంట తీర్థాలు' గా పిలుస్తూ వుంటారు.
రామలక్ష్మణుల కారణంగానే ఈ తీర్థాలు ఆవిర్భవించాయని చెబుతుంటారు. ఈ ప్రాంతంలోని వాళ్లు మంచినీటి కోసం ఇబ్బంది పడుతూ వుండటం గమనించిన సీతాదేవి, ఆ విషయాన్ని రామలక్ష్మణుల దగ్గర ప్రస్తావించిందట. దాంతో రామలక్ష్మణులు భూదేవికి నమస్కరించి ... గంగాదేవిని ప్రార్ధించి ఈ ప్రదేశంలో బాణాలు ప్రయోగించారట. ఆ బాణాలు తాకిన ప్రదేశం నుంచి పాతాళగంగ పొంగుతూ వచ్చి ఈ తీర్థాలు ఏర్పడ్డాయని చెబుతారు.
ఇప్పటికీ ఈ జంట తీర్థాలను ఇక్కడ చూడవచ్చు. కాస్త చిన్నదిగా కనిపించేది లక్ష్మణ తీర్థంగా చెబుతారు. ఇక విశాలంగా పెద్దదిగా కనిపించే తీర్థం రాముడిదని అంటారు. సాక్షాత్తు రాముడిచే రప్పించబడిన పాతాళ గంగచే ఏర్పడిన ఈ తీర్థం మహిమాన్వితమైనదని చెబుతుంటారు. స్వచ్ఛమైన జలంతో నిండుగా కనిపించే ఈ తీర్థంలో స్నానం చేయడం వలన సమస్తపాపాలు నశిస్తాయని విశ్వసిస్తుంటారు.