భగవంతుడు చూస్తూనే వుంటాడు

ఎవరు చేసిన పాపాలు వాళ్లని కష్టాల రూపంలో వెంటాడుతూనే వుంటాయి. ఎవరు చేసిన పుణ్యాలు వారికి సుఖసంతోషాలను అందిస్తూనే వుంటాయి. పాపపుణ్యాలే జీవితంపై ప్రభావం చూపుతుంటాయి. అలాంటి పాపపుణ్యాలను నిర్ణయించేవాడు భగవంతుడే.

ఎవరు ఎలాంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ... ఏమేం చేస్తున్నారనే విషయాన్ని ఆయన చూస్తూనే వుంటాడు. చేసిన పనికి ప్రతిఫలాన్ని అందిస్తూనే వుంటాడు. పుణ్యఫలాలను ఎవరైనా ఆనందంగా అందుకుంటారు. కానీ పాపఫలితాలను స్వీకరించకుండా తప్పించుకు తిరగడానికి ప్రయత్నిస్తుంటారు. అయినా భగవంతుడు వాళ్లని వెతికి పట్టుకుని మరీ పాపఫలితాన్ని ముట్టజెబుతుంటాడు.

ఎవరికి ఏది ఇవ్వాలో ... ఎంత వరకూ ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. దానిని అడ్డుకోవడానికి చూసేవారిని భగవంతుడు క్షమించడు. ఎందుకంటే ఒక రకంగా అది ఆయన నిర్వహించే విధికి అడ్డుతగలడమే అవుతుంది. కొంతమంది ఇతరుల పట్ల ద్వేషం పెంచుకుని వాళ్లని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సమయం రాగానే చేయవలసినదంతా చేసి, మూడో కంటికి తెలియకుండా చేయగలిగామని తమ తెలివి తేటలకు మురిసిపోతుంటారు.

కానీ దేవుడనేవాడు ఒకడున్నాడు ... వాడు పైనుంచి అంతా చూశాడు ... తమ తెలివితేటలకి మెచ్చి తగిన ఫలితాన్ని ఇచ్చాడని తెలుసుకోవడానికి వాళ్లకి ఎంతోకాలం పట్టదు. అందుకే మాటల ద్వారాగానీ ... చేతల ద్వారా గాని ఇతరులకి హాని చేయకూడదని శాస్త్రం చెబుతుంది. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడనే స్పృహ .. ధర్మమార్గం తప్పకుండా నడచుకోవడానికి దోహదపడుతుంది. ఆ ధర్మం తప్పిననాడు తాను ఉన్నాననే విషయాన్ని భగవంతుడే గుర్తుచేస్తాడు.


More Bhakti News