ఇక్కడి సత్యనారాయణస్వామి ప్రత్యేకత ఇదే !

త్రిమూర్తి స్వరూపుడిగా సత్యనారాయణస్వామి ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన క్షేత్రంగా 'అన్నవరం' దర్శనమిస్తుంది. సాక్షాత్తు స్వామివారు ఆవిర్భవించిన ఈ క్షేత్రం పౌరాణిక పరంగాను ... చారిత్రక పరంగాను ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడి రమాసహిత సత్యనారాయణస్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన్నే కష్టాలు తీరిపోతాయని చెప్పబడుతోంది.

సమస్త సమస్యల నుంచి బయటపడేసి ... సంతోషాలను ప్రసాదించే శక్తి సత్యనారాయణస్వామి వ్రతానికి వుంది. అందుకే స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడి సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొంటూ వుంటారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ప్రదేశాల్లోనూ స్వామివారి ఆలయాలు తమ విశిష్టతను చాటుకుంటూ కనిపిస్తాయి. అలాంటి సత్యనారాయణస్వామి ఆలయాలలో ఒకటి నాగార్జునసాగర్ లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ - హిల్ కాలనీలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల ఘన చరిత్రను కలిగిన ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. పౌర్ణమి రోజుల్లోనూ ... కార్తీకమాసంలోను ఇక్కడ పెద్ద సంఖ్యలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతూ వుంటాయి. ఇక వివాహాలు కూడా అత్యధిక సంఖ్యలో జరుగుతూ ఉండటం ఇక్కడి విశేషం.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల వివాహం ప్రశాంతమైన ... పవిత్రమైన ప్రదేశంలో జరగాలని ఆశిస్తారు. వాళ్ల వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలనే ఉద్దేశంతో, నూతన వధూవరులచే సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తుంటారు. ఆ తరువాత ఆ దంపతులతో ఏదైనా క్షేత్ర దర్శనం చేయిస్తుంటారు.

ఈ క్షేత్రంలో వివాహం జరిపించడం వలన, అవన్నీ కలిసివస్తాయని భావిస్తూ వుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో సత్యనారాయణస్వామి వ్రతాలతో పాటు వివాహాలు కూడా అధికంగా జరుగుతూ వుంటాయి. ఈ క్షేత్రం యొక్క విశిష్టతను చాటుతూ వుంటాయి.


More Bhakti News