భయమనేది ఇలా దూరమైపోతుంది !

మనసులో ఒకసారి భయమనేది పుట్టాక అది మర్రిచెట్టులా పాతుకుపోతుంది. ఎంతమంది ఎన్ని విధాలుగా ధైర్యం చెప్పినా భయం బారి నుంచి బయటపడటం అంతతేలిక కాదనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం ... ప్రయోజనం లేకపోవడం జరుగుతూ వుంటుంది.

భయపడటానికి అనేక కారణాలు ఉంటూ వుంటాయి. ఆపదలో వున్నవాళ్లు ... అపరాధం చేసిన వాళ్లు ఎక్కువగా భయపడుతుంటారు. కొన్ని సంఘటనలు చూపిన ప్రభావం కారణంగా కొంతమంది ఒంటరిగా ఉండటానికి భయపడుతుంటారు.

తమవాళ్లు ఆపదలో వున్నప్పుడు కుటుంబసభ్యులు భయపడటం సాధారణంగా జరుగుతూ వుంటుంది. ఒక్కోసారి ఆ భయం కారణంగానే వాళ్లని కాపాడుకోలేని పరిస్థితి వస్తుంటుంది. అందువలన భగవంతుడిపై భారం వేసి ధైర్యంగా తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించడం వలన ఆపద నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.

ఇక ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందోననే భయం కూడా కొంతమందిని వెంటాడుతూ వుంటుంది. అలాంటి వాళ్లు ''జలే రక్షతు వారాహః .. స్తలే రక్షతు వామనహః .. అటవ్యాం నారసింహశ్చ ... సర్వతః పాతుకేశవః'' అనే శ్లోకాన్ని పఠించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

జల సంబంధమైన ప్రమాదాల నుంచి వరాహస్వామి ... నేలపై జరిగే ప్రమాదాల నుంచి వామనుడు ... అడవీ ప్రదేశాల్లో ఎదురయ్యే ఆపదల నుంచి నరసింహస్వామి ... ఇక ఎక్కడ ఆపదలో పడకుండా కేశవుడు తమని రక్షించాలని వేడుకోవడం జరుగుతుంటుంది. ఈ శ్లోకాన్ని పఠించడం వలన ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతుడు తమకి తోడుగా ఉంటాడనే భావన కలుగుతుంది. ఆయన తమని తప్పక రక్షిస్తాడనే విశ్వాసం పెరుగుతుంది. భగవంతుడిపై విశ్వాసమే భయానికి విరుగుడు కనుక, అది ఆ క్షణంలోనే అదృశ్యమైపోతుంది.


More Bhakti News