శుభాలను ప్రసాదించే శంకరుడు
పరమశివుడి లీలావిన్యాసాలు ఆయన భక్తులను పరవశింపజేస్తుంటాయి. మహాదేవుడి మహిమలుగా కనిపించే ఆ సంఘటనలు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు, సహజంగానే అక్కడ ఆయన ఆవిర్భవించిన తీరును గురించి తెలుస్తూ వుంటుంది. అప్పుడే ఆ క్షేత్రానికి గల మహాత్మ్యం గురించి అర్థమవుతూ వుంటుంది.
అలా ఆదిదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాల్లో 'చౌదర్ పల్లి' ఒకటిగా కనిపిస్తుంది. మెదక్ జిల్లా 'దుబ్బాక మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పూర్వకాలంలో మహర్షులు ... మహారాజులు పూజించిన స్వయంభువు శివలింగాలు కొన్ని కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయి. భగవంతుడు తిరిగి ప్రకటనమవ్వాలని అనుకున్నప్పుడు, అందుకు వివిధ మార్గాలను అనుసరిస్తూ వచ్చాడు.
అందులో భాగంగానే ఇక్కడి శివలింగం, దుబ్బ వంటి ప్రదేశాన్ని నాగలితో దున్నుతూ వుండగా బయటపడటం జరిగింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని 'దుబ్బ రాజేశ్వరుడు'గా కొలుస్తుంటారు. శివలింగం ఎక్కడైతే బయటపడిందో అక్కడి నుంచి కదిలించడానికి చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తూ ఉండటంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనని ఆరాధిస్తూ వుంటారు. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ... విశేష సేవలలో పాల్గొంటూ ఆయన పట్ల కృతజ్ఞతను చాటుకుంటూ వుంటారు. ఈ స్వామిని సేవించడం వలన కష్టాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.