మంచితనం ఎప్పుడూ గెలుస్తూనే వుంటుంది

అనంతమైన ఈ విశ్వంలో ప్రతి జీవిలోనూ భగవంతుడు వున్నాడు. అందరిలోని చైతన్యము ఆయనే ... ఆనందము ఆయనే. ఈ కారణంగానే భగవంతుడి తత్త్వాన్ని గురించి తెలిసిన వాళ్లు అందరినీ సమానంగా చూస్తుంటారు ... ఆదరిస్తుంటారు. తమ పట్ల ఆదరాభిమానాలను చూపినవారి పట్ల వాళ్లు ఎలా వ్యవహరిస్తారో, తమని ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించినవారి పట్ల కూడా వాళ్లు అదే భావనను ఆవిష్కరిస్తూ వుంటారు.

అందుకు ఉదాహరణగా నిలిచే వారిలో భక్త జ్ఞానదేవుడు సోదరి అయిన 'ముక్తాబాయి' కూడా కనిపిస్తుంది. ముక్తాబాయికి ముగ్గురు సోదరులు ... బాల్యంలోనే వాళ్ల కుటుంబం గ్రామస్తులచే వెలివేయబడుతుంది. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్లు ఆ పాండురంగస్వామిపై భారం వేసి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా 'విసోబా' అనే వ్యక్తి వాళ్లని మరింతగా వేధించసాగాడు.

ఒకసారి వాళ్లు భిక్ష చేయగా వచ్చిన పిండితో రొట్టెలు చేసుకోవాలనుకుంటారు. అయితే వాళ్లకి ఆయన రొట్టెల పీట కూడా దొరక్కుండా చేస్తాడు. వాళ్లు ఎలా రొట్టెలు చేసుకుంటారో చూద్దాం అన్నట్టుగా కిటికీ దగ్గర దాక్కుంటాడు. అప్పుడు ముక్తాబాయి వాళ్ల సంభాషణలో ఆయన ప్రస్తావన వస్తుంది. తమకి రొట్టెల పీట లభించకుండా చేసినా, విసోబాలోను తాను పాండురంగడినే చూస్తున్నానని సోదరులతో ముక్తాబాయి చెబుతుంది.

ఆ మాటలు విన్న విసోబా సిగ్గుపడతాడు. వాళ్లని అనేక ఇబ్బందులకు గురిచేసినందుకు కన్నీళ్ల పర్యంతమవుతాడు. తనని మన్నించమంటూ వచ్చి ముక్తాబాయి పాదాలపై పడతాడు. అతనిలోని ఆ మార్పుకి కూడా ఆ పాండురంగడే కారణమంటూ ముక్తాబాయి మనసు కుదుటపడేలా చేస్తుంది.


More Bhakti News