ఒకప్పుడు ఈ క్షేత్రం పేరు మోహినీపురమట !
సుబ్రహ్మణ్యస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రసిద్ధ క్షేత్రాలలో 'మోపిదేవి' మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. కృష్ణా జిల్లా పరిధిలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ దర్శనమిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి చుట్టాలు చుట్టుకున్న సర్పంగా ... దానినే పానవట్టంగా చేసుకున్న లింగరూప ధారిగా శివుడు దర్శనమిస్తూ వుండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెప్పబడుతోంది.
సాక్షాత్తు సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తపస్సు చేసుకున్నాడనీ, అగస్త్య మహర్షి కోరికమేరకు ఆయన ఇక్కడ ఆవిర్భవించడం జరిగిందని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి స్వామి ఎంతో మహిమగలవాడని చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన మహిమలు భక్తులకు అనుభవంలోకి వస్తూనే ఉంటాయని అంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైవున్న స్వామిని దర్శించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని అంటారు.
వివాహం విషయంలో ఆటంకాలు ఎదుర్కుంటున్నవాళ్లు ... సంతాన లేమితో బాధలు పడుతోన్నవాళ్లు ఎక్కువగా ఈ స్వామిని దర్శించి తమ ఆవేదనను చెప్పుకుంటూ వుంటారు. స్వామి అనుగ్రహంతో ఆశించిన ఫలితాలను పొందినవాళ్లు ఇచ్చిన మాట ప్రకారం మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు. ఇలా భక్తుల పాలిట కొంగుబంగారమై అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లోను కనిపిస్తుంది. పురాణాల్లో 'మోహినీపురం' పేరుతో కనిపించే ఈ క్షేత్రం, కాలక్రమంలో మార్పుకులోనై 'మోపిదేవి' గా పిలవబడుతోంది. అశేష భక్తజనులచే నిత్యనీరాజనాలు అందుకుంటోంది.