అదే నరసింహస్వామి మహాత్మ్యం

నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో 'అహోబిలం' ముందువరుసలో కనిపిస్తుంది. తన పట్ల ప్రహ్లాదుడికి గల విశ్వాసాన్ని కాపాడటం కోసం, స్వామి ఇక్కడ ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడని స్థలపురాణం చెబుతోంది. అలా ఇక్కడ ఆవిర్భవించిన స్వామివారు చూపుతోన్న మహిమలు అన్నీ ఇన్నీకావు.

స్వామివారి మహిమలను ప్రత్యక్షంగా చూసినవారిలో కాకతీయ ప్రతాపరుద్రుడు కూడా కనిపిస్తుంటాడు. ప్రతాపరుద్రుడు మహా శివభక్తుడు ... శివారాధన చేయకుండా ఆయన దైనందిన కార్యక్రమాలను ఆరంభించేవాడు కాదు. అనునిత్యం ఆయన బంగారంతో ఒక శివలింగాన్ని పోతపోయించి పూజాభిషేకాలు నిర్వహించి దానిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవాడట.

ఒకసారి అహోబిల క్షేత్రానికి సమీపంగా వచ్చిన ఆయన, అక్కడ పూజాభిషేకాలు జరపడంకోసం బంగారంతో శివలింగాన్ని పోతపోయిస్తాడు. అది లింగాకారాన్ని కాకుండా నరసింహస్వామి రూపాన్ని సంతరించుకుందట. అది చూసి ఆశ్చర్యపోయిన ఆయన, అహోబిల నరసింహస్వామి మహిమే అందుకు కారణమని భావిస్తాడు. వెంటనే అక్కడి నుంచి అహోబిలం చేరుకొని స్వామివారిని దర్శించుకుంటాడు. శివుడితో సమానంగా ఆయన నరసింహస్వామిని పూజిస్తాడు.

అహోబిలం క్షేత్ర విశిష్టతకు ముగ్ధుడైన ప్రతాపరుద్రుడు, ఆలయ అభివృద్ధికిగాను తన వంతు సహకారాన్ని అందిస్తాడు. అందుకు గుర్తుగా ఇక్కడ కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు కనిపిస్తూ వుంటాయి. అప్పట్లో ప్రతాపరుద్రుడు బంగారంతో శివలింగాన్ని పోతపోయించడానికి ప్రయత్నించగా అది నరసింహస్వామి ఆకృతిని పొందిందని చెప్పుకున్నాం కదా, అహోబిలం దర్శించుకున్న భక్తులు ఇప్పటికీ దానిని ఇక్కడ చూడవచ్చు. మనోహరమైన ... మహిమాన్వితమైన ఈ క్షేత్రం, దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News