ఈ రోజున గోమాతను పూజించాలి

గోవు సకల దేవతా స్వరూపంగా చెప్పబడుతోంది. అందువలన గోవును పూజిస్తే ... సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని అంటారు. భగవంతుడిని అభిషేకించడానికి ఉపయోగించే పంచామృతాలలో ఆవుపాలు .. ఆవుపెరుగు ... ఆవునెయ్యి ప్రధానంగా కనిపిస్తాయి. భగవంతుడి నైవేద్యాలలో కూడా ఆవుపాలు అత్యంత విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తాయి.

యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు. గోవు సమస్త దేవతల స్వరూపంగా చెప్పబడుతోంది కాబట్టి, వాళ్లందరి అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు.

అలాంటి గోవును అనునిత్యం పూజించవచ్చు ... అయితే కొన్ని విశేషమైన పుణ్యతిథుల్లో పూజించడం వలన కలిగే ఫలితం మరింత విశేషంగా ఉంటుందని చెప్పబడుతోంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా 'ఆశ్వయుజ బహుళ ద్వాదశి' కనిపిస్తుంది. దీనినే 'గోవత్స ద్వాదశి' అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో ... పూలమాలికతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు .. పెరుగు .. నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం కనిపిస్తుంది. దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ ఈ రోజున గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News