విషబాధలు లేకుండా చేసే స్వామి

భగవంతుడు కొలువుదీరిన క్షేత్రాలన్నీ పవిత్రమైనవే ... ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ పుణ్యప్రదమైనవే. అందుకే భక్తులు తాము విశ్వసిస్తోన్న దేవుడు కొండకోనల్లో కొలువుదీరినా ... అడవీ ప్రాంతాల్లో ఆవిర్భవించినా ఆయనని వెతుక్కుంటూ వెళుతూనే వుంటారు. దైవదర్శనం కాగానే ... ఆ ప్రయాణంలో తాముపడిన కష్టాలను మరిచిపోతుంటారు.

ఇలా కొండకోనల్లో కొలువై లక్షల సంఖ్యలో భక్తులను రప్పించుకునే దైవంగా 'అయ్యప్పస్వామి' కనిపిస్తుంటాడు. 'శబరిమల' కు బయలుదేరిన చాలామంది భక్తులు ఆ స్వామి కొలువైన 'అచ్చన్ కోవిల్' ను కూడా దర్శించుకుంటూ వుంటారు. ఈ క్షేత్రంలో స్వామివారు గృహస్తాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ పూర్ణ - పుష్కళతో కలిసి దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడి మూలమూర్తిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.

స్వామివారు బంగారు కత్తిని కలిగి ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. ఈ కత్తిని సాక్షాత్తు దేవతలే స్వామివారికి బహుకరించారట. సాధారణంగా ఒక్కో క్షేత్రం ఒక్కో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఆ క్రమంలో ఇది విష బాధలను తొలగించే క్షేత్రంగా చెప్పబడుతోంది. అరణ్య ప్రాంతం కావడం వలన ఇక్కడ విష కీటకాలు ఎక్కువగా సంచరిస్తూ వుంటాయి.

ఒకప్పుడు వీటి బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండేదట. అలా విష కీటకాల బారినపడిన వాళ్లకి, స్వామివారి చేతి నుంచి తీసిన గంధాన్నీ ... తీర్థాన్ని ఇస్తారట. దాంతో వెంటనే ఉపశమనం కలిగేదని చెబుతుంటారు. ఇలా విష కీటకాల బారినపడి స్వామివారి అనుగ్రహంతో బతికి బయటపడినవాళ్లు వున్నారని అంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, భవిష్యత్తులో కలగనున్న విషబాధలు కూడా దూరమైపోతాయని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News