శిరిడీసాయి ఇలా అనుగ్రహించాడు
బాబాను దర్శిస్తేచాలు ... తాము చెప్పుకునే కష్టాలను ఆయన వింటే చాలు వెంటనే అవి తొలగిపోతాయని భక్తులు విశ్వసించేవాళ్లు. ఈ కారణంగానే ఎంతోమంది ఆయనని దర్శించి తరించేవాళ్లు. అలాంటివాళ్లలో 'బూటీ' ఒకడుగా కనిపిస్తాడు. శ్రీమంతుడైన బూటీ ... తనకి 'సర్పగండం' వుందని తెలిసి కంగారుపడిపోతాడు. తనని బాబా మాత్రమే రక్షించగలడనే నమ్మకంతో నాగపూర్ నుంచి శిరిడీ చేరుకుంటాడు.
ఆయనని చూడగానే అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపొమ్మంటూ బాబా ఆగ్రహిస్తాడు. దాంతో బూటీ తీవ్రమైన మనస్తాపానికి గురవుతాడు. బాబా అలా వ్యవహరించడం వెనుక ఏదో కారణం ఉంటుందని ఆయన మనసుకి ఊరట కలిగించి శ్యామా ఆయనని పంపించివేస్తాడు. మార్గమధ్యంలో ఒకచోట విశ్రాంతి తీసుకున్న ఆయనని ఒక నాగుపాము సమీపిస్తుంది. ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని భావించిన ఆయన చివరిసారిగా బాబాను తలచుకుంటాడు.
అంతే ఎక్కడి నుంచో ఒక 'ముంగీస' వచ్చి ఆ నాగుపాముతో పోరాడి దానిని చంపేస్తుంది. తన ప్రాణాలు కాపాడినది బాబాయేనని ఆయన గ్రహిస్తాడు. బాబా తరిమేసినట్టుగా మాట్లాడినది తనని కాదనీ ... తనకి గల సర్పగండాన్ని అని ఆయనకి అర్థమవుతుంది. అంతే అక్కడి నుంచి వెనుదిరిగి శిరిడీ చేరుకుంటాడు. అంతకుముందు రోజుకన్నా బాబా బాగా అలసిపోయి వుండటం చూస్తాడు. తన ప్రాణాలు కాపాడటం కోసం ఆయన తీసుకున్న శ్రమయే అందుకు కారణమని భావించి, కన్నీళ్ల పర్యంతమవుతూ పాదాలపై పడతాడు.
కృతజ్ఞతా పూర్వకంగా తాను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాననీ, అదేమిటో చెప్పనిదే అక్కడి నుంచి కదలనని అంటాడు. 'కృష్ణ మందిరం' నిర్మించమని ఆదేశిస్తాడు బాబా. అలా బాబా అనుగ్రహాన్ని పొందిన బూటీ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు.