విద్యార్థులు దర్శించుకోవలసిన క్షేత్రం

వెలుగు రాకతో చీకటి తొలగిపోయినట్టు, జ్ఞానము వలన అజ్ఞానం నశిస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలోను ... తనని తాను ఉన్నతుడిగా తీర్చిదిద్దుకోవడంలోను జ్ఞానం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ... పట్టుదలతో దానిని చేరుకోవడంలో జ్ఞానం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.

అలాంటి జ్ఞానం సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహమే ప్రత్యేకమైన గుర్తింపునీ ... కీర్తిప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. అక్షరాన్ని దిద్దించిన దగ్గర నుంచి అభివృద్ధి పథంలో నడిపించడం వరకూ అమ్మవారు ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ కారణంగానే విద్యార్థినీ విద్యార్థులు అమ్మవారిని దర్శించుకోవడం ... ఆశీస్సులు అందుకోవడం చేస్తుంటారు.

సాధారణంగా సరస్వతీదేవి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో ఉన్న ఆలయాలన్నీ కూడా విశిష్టతను సంతరించుకున్నవే. అలాంటి ఆలయాలలో ఒకటి మనకి 'అడ్లూరు' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా 'శాలి గౌరారం' మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. జిల్లాలోనే మొట్టమొదటి సరస్వతీదేవి క్షేత్రంగా ఇది ఘనతను సంపాదించుకుంది.

ఒక భక్తుడి సంకల్పం మేరకు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అమ్మవారి ఆదేశం ప్రకారమే ఆయన ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతుంటారు. ఆలయానికి దగ్గరలో గల ఆయన సమాధిని కూడా భక్తులు దర్శించికుంటూ వుండటం విశేషం. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వలన జ్ఞానం వికసిస్తుందనీ ... విజయం చేకూరుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు.


More Bhakti News