దానం వలన ధనం వృద్ధి చెందుతుందా ?
లోకంలో ధనానికి వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆశలు నెరవెరాలన్నా ... ఆశయాలు నిజం కావాలన్నా అందుకు ధనం ఎంతో అవసరం. అవసరాలు తీరాలన్నా ... విలాసాలను అనుభవించాలన్నా ధనం కావలసిందే. అన్ని ఆశలు ధనంతో ముడిపడినవి కాకపోవచ్చు. కానీ కొన్ని కలలు నిజం చేసుకోవడానికి అది ఎంతో అవసరమవుతుంది.
ధనమనేది సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపునీ ... స్థానాన్ని కల్పిస్తుంది. అందువల్లనే దాని విషయంలో అంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. సాధారణంగా ధనాన్ని పెంచుకోవడానికిగాను ఎవరికి తెలిసిన వ్యాపార వ్యవహారాలను వాళ్లు నిర్వహిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన అనతికాలంలోనే ఆ ధనం రెట్టింపు అవుతుందని భావిస్తుంటారు.
మరికొందరు ఉన్న ధనం భద్రంగా ఉంటే చాలని భావించి దానిని కాపాడుకుంటూ వస్తుంటారు. ఇలా ఆలోచించడం వలన ధనం పెరుగుతుంది ... కాపాడబడుతుందేగానీ, తరువాత జన్మకి అవసరమైన పుణ్యరాశి ఆవగింజంతైనా పెరగదు. ఉత్తమగతులను పొందాలంటే తమ దగ్గర గల ధనంలో నుంచి ఎంతో కొంత దానధర్మాలకు ఉపయోగించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
నిరుపేదలైనవారికి అన్నం పెట్టి వాళ్లకి వస్త్రాలను దానం చేయడం వలన పుణ్యఫలాలు లభించడమే కాకుండా, ధనం పెరుగుతూ వెళుతుందని చెప్పబడుతోంది. దానం వలన పుణ్యరాశి పెరుగుతుంది ... దాని ఫలితం కారణంగా ధనం వృద్ధి చెందుతుందని స్పష్టం చేయబడుతోంది.