అలా అమ్మవారు శాంతించిందట !

పౌరాణిక ప్రాశస్త్యం ... చారిత్రక వైభవం కలిగిన శైవ క్షేత్రాల్లో 'నందివెలుగు' ఒకటిగా కనిపిస్తుంది. అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరించే ఈ క్షేత్రం గుంటూరు జిల్లాలో అలరారుతోంది. ఈ క్షేత్రంలోనే 'దుర్గాదేవి' ఆలయం కూడా దర్శనమిస్తుంది. శాంత స్వరూపిణిగా కనిపించే అమ్మవారు, భక్తులచే విశేష పూజలు అందుకుంటూ వుంటుంది.

ఇక్కడి గర్భాలయంలోని అమ్మవారు ... విజయవాడలోని ఇంద్రకీలాద్రివైపు చూసున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మవారు ఇలా దర్శనమివ్వడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ వుంటుంది. పూర్వం ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉండేదట. అందువలన ఈ ప్రాంతంలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉండేవి.

భక్తులంతా భయాందోళనలకి లోనవుతున్న పరిస్థితుల్లో, ఆలయపూజారి కలలో అమ్మవారు కనిపించిందట. తన ఉగ్రస్వరూపాన్ని అక్కడి బావిలో స్థాపితం చేసి ... ఇంద్రకీలాద్రి వైపు చూస్తున్నట్టుగా తన శాంత స్వరూపాన్ని ప్రతిష్ఠించమని చెబుతుంది. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు అందుకు తమవంతు సహకారాన్ని అందిస్తారు.

ఫలితంగా అమ్మవారి ఆదేశం ప్రకారం ఇక్కడి మూలమూర్తి ఇంద్రకీలాద్రి వైపు చూస్తున్నట్టుగా ప్రతిష్ఠించబడుతుంది. ఆ రోజు నుంచి శాంతమూర్తిగా మారిపోయిన అమ్మవారు, తన పట్ల విశ్వాసాన్ని పెంచుకున్న భక్తులను బిడ్డలా మాదిరిగా కాపాడుతూ వస్తోంది. చల్లని చూపులను ప్రసరింపజేసే స్వామివారి విశేషాలకు, అనురాగవల్లి అయిన అమ్మవారి మహిమలకు ఈ క్షేత్రం వేదికగా కనిపిస్తుంది. అలాంటి ఈ దివ్య క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించితీరాలి ... ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదిస్తూ తరించాలి.


More Bhakti News