ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించాలి
శ్రీమహావిష్ణువు నామాన్ని స్మరించినంత మాత్రాన ... ఆయన ఆలయ శిఖరాన్ని దర్శించినంత మాత్రాన సమస్త పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. గోరంత సేవలు చేస్తే చాలు ... కొండంత వరాలను కురిపించే దైవంగా ఆయన భక్తుల హృదయ సింహాసనంపై కొలువుదీరి కనిపిస్తాడు.
లోక కల్యాణం కోసం ఆయన వివిధ అవతారాలను ధరించాడు. తన భక్తులు ఆపదల్లో వున్న సమయాల్లో తనని తాను మరిచి పరిగెత్తుకు వచ్చిన సందర్భాలు పురాణాల్లో కనిపిస్తూ వుంటాయి. అలాంటి శ్రీమన్నారాయణుడిని అనునిత్యం పూజించాలి ... అనుక్షణం ఆరాధించాలి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ స్వామిని సేవించడం వలన లభించే పుణ్యఫలాలు మరింత విశేషంగా ఉంటాయని చెప్పబడుతోంది.
ముఖ్యంగా 'ఏకాదశి వ్రతం' ఆచరించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. అలా ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజున కూడా వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని 'ఇందిరా ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి ... శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించవలసి వుంటుంది. విష్ణు సహస్ర నామం చదువుతూ జాగరణ చేయవలసి వుంటుంది.
ఈ విధంగా చేయడం వలన స్వామివారిని సేవించినవారి పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయి. అంతే కాకుండా .. వాళ్ల పితృదేవతలు యమలోకంలో కనుక బాధలు పడుతూ వుంటే, వారికి ఆ బాధల నుంచి విముక్తి లభించి వైకుంఠానికి చేరుకుంటారని చెప్పబడుతోంది.