మహాపురుషుల మాట వృథా కాదు
సదాశివుడి అనుగ్రహంతో మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మిస్తాడు. బాలుడే అయినా భగవంతుడిపట్ల గల భక్తి ... ఆయన సేవ చేయడానికి చూపించే ఆసక్తి చూసి అంతా ఆశ్చర్యపోయేవారు. తండ్రి మృకండ మహర్షి నిత్య పూజలకి కావలసిన ఏర్పాట్లను మార్కండేయుడే చేస్తుంటాడు. ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోవాలో ... అతణ్ణి తరుముకొస్తున్న మృత్యువును చూసి బాధపడాలో తెలియని పరిస్థితుల్లో మృకండ మహర్షి వుంటాడు.
అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి ఒక ఆలోచన వస్తుంది. మహాపురుషుల ఆశీస్సులు వ్యర్థం కావు ... వారి సూచనలు పరిష్కరించని సమస్యలు వుండవు. అందువలన తమ ఆశ్రమానికి ఏ మహర్షి వచ్చినా సాష్టాంగ నమస్కారం చేయమని మార్కండేయుడితో చెబుతాడు. అలా ఒకసారి సప్తరుషులు ఆశ్రమానికి రాగానే, మార్కండేయుడు వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వాళ్లంతా కూడా ఆ బాలుడిని 'చిరంజీవ' అంటూ దీవిస్తారు.
అప్పుడు మృకండ మహర్షి వాళ్లకు అసలు విషయం చెబుతాడు. మహర్షుల మాట వృథా కాదు ... కానీ ఆ బిడ్డ అల్పాయుష్కుడని చెప్పినవాడు పరమశివుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆలోచనలోపడిన సప్తరుషులు కొంతసేపటికి తేరుకుని, ఆందోళన చెందవలసిన పనిలేదని మృకండ మహర్షితో చెబుతారు. తమ మాట నిజం కావాలంటే మహాదేవుడిని మార్కండేయుడు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుందని అంటారు.
తాను ఆశించిన విధంగానే సప్తరుషుల ఆశీస్సులు ... వాళ్ల సూచన లభించినందుకు మృకండ మహర్షి సంతోషపడతాడు. సప్తరుషుల సూచనమేరకు ఆ సదాశివుడిని సదా ధ్యానించమని మార్కండేయుడితో చెబుతాడు. ఆయన ఆదేశం మేరకు సదాశివుడిని మెప్పించిన మార్కండేయుడు 'చిరంజీవి'గా నిలిచిపోతాడు.