ఆదిదేవుడు అది సహించలేక పోయాడట !
భక్తి పరంగాను ... భాషా పరంగాను ... రచనల పరంగాను తులసీదాస్ స్థాయిని, అతనితో పాటు కలిసి చదువుకున్న రవిదత్తుడు సహించలేకపోతాడు. తులసీదాస్ ఆ ఊళ్లో ఉన్నంత వరకూ తన ఉనికిని చాటుకోవడం కూడా కష్టమేననే విషయం ఆయనకీ అర్థమైపోతుంది. దాంతో కాశీ నగరం నుంచి ఆయనని పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.
ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, ఆయనే నేరుగా తులసీదాస్ ని కలుసుకుంటాడు. తనకి ఒక వరం ఇవ్వవలసినదేనంటూ పట్టుబడతాడు. అందుకు తులసీదాస్ అంగీకరించడంతో, కాశీ నగరాన్ని విడిచి వెళ్లవలసినదిగా కోరతాడు. ఇచ్చిన మాటకి కట్టుబడిన తులసీదాస్, అతికష్టం మీద కాశీ నగరం నుంచి బయలుదేరుతాడు.
తేలికగా ఊపిరి పీల్చుకున్న రవిదత్తుడు, అక్కడి నుంచి నేరుగా విశ్వేశ్వరుడి దర్శనానికి వెళతాడు. అతడు ఆలయంలో అడుగుపెడుతూ ఉండగానే, అతని ప్రవేశాన్ని వారిస్తున్నట్టుగా కోపంతో కూడిన మాటలు వినిపించడంతో ఒక్కసారిగా ఆగిపోతాడు. ఆ మాటలు గర్భాలయంలో నుంచే వచ్చినట్టుగా గ్రహిస్తాడు. మహా భక్తుడైన తులసీదాస్ ని కాశీ నుంచి పంపించివేసి అతను మహాపాపం చేశాడనే మాటలు గర్భాలయం నుంచి వస్తాయి. వెంటనే వెళ్లి చేసిన అవమానానికి గాను తులసీదాస్ కి క్షమాపణ చెప్పి తీసుకురమ్మని శివుడు చెబుతాడు. అతను తిరిగి వచ్చిన తరువాతనే తన దర్శనం లభిస్తుందని అంటాడు.
దాంతో తులసీదాస్ ... పరమేశ్వరుడి మనసును ఎంతగా దోచుకున్నాడనేది ఆయనకి అర్థమైపోతుంది. తనని మన్నించమని శివుడిని కోరిన రవిదత్తుడు, తులసీదాస్ ను తీసుకు రావడానికి హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. శివాంశ సంభూతుడుగా చెప్పబడుతోన్న హనుమంతుడి మనసునే కాదు, సాక్షాత్తు శివుడి మనసునే గెలుచుకున్న భక్త శిఖామణిగా తులసీదాస్ కనిపిస్తాడు.