అదే ఈ పుష్కరిణి ప్రత్యేకత !
భగవంతుడు నడయాడిన పుణ్యక్షేత్రాలు ... ఆయన సంకల్పం కారణంగా ఏర్పడిన పుణ్యతీర్థాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇలాంటి క్షేత్రాల్లో అడుగుపెట్టడం వలన ... అక్కడి పుణ్యతీర్థాలను సేవించడం వలన విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. పౌరాణిక నేపథ్యం కలిగిన అలాంటి క్షేత్రాల్లో 'తిరుప్పరంకున్రం' ఒకటిగా కనిపిస్తుంది.
శూరపద్ముడుని సంహరించి ఆయన ఆక్రమించిన సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగిస్తాడు సుబ్రహ్మణ్యస్వామి. అందుకు సంతోషించిన దేవేంద్రుడు తన కూతురు 'దేవసేన'ను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహాన్ని జరిపిస్తాడు. అద్భుతమైన ఆ సంఘటనకి వేదికగా నిలిచిన ప్రదేశమే ఈ 'తిరుప్పరం కున్రం'. అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరించే ఈ పుణ్యక్షేత్రంలో 'శరవణ పొయ్ గై ' అనే సువిశాలమైన పుష్కరిణి కనిపిస్తుంది.
స్వచ్ఛమైన జలంతో ... పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తీర్థం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఈ పుష్కరిణిని దర్శించినంత మాత్రాన్నే పాపాలు పటాపంచలు అవుతాయని చెబుతుంటారు. ఇక్కడికి సమీపంలో గల విశ్వనాథుడికి ఈ తీర్థంలోని నీటితోనే నిత్యాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇందులోని నీటిని తీర్థంగా స్వీకరించినా ... తలపై చల్లుకున్నా సమస్త దోషాలు నశించి, సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.