దానం చేసినది తిరిగి తీసుకుంటే ?
కుడిచేత్తో చేసే దానం ఎడమచేతికి కూడా తెలియకూడదనే మాట కర్ణుడి కాలం నుంచి ప్రచారంలో వుంది. దానం చేయాలని అనుకున్నప్పుడు వెంటనే చేసెయ్యాలి. లేదంటే ఏ క్షణంలోనైనా మనసు మారిపోవచ్చని ఒకానొక సందర్భంలో కర్ణుడు చెప్పినట్టుగా మనకి 'మహాభారతం'లో కనిపిస్తుంది.
దయాగుణం కలిగిన వాళ్లే దానధర్మాలు చేస్తుంటారు. కొంతమంది సేవ ద్వారా తమని మెప్పించినవారికి ఏదో ఒకటి దానంగా ఇచ్చేస్తుంటారు. మరికొంతమంది తమ మనసు గెలుచుకున్నవారికి అభిమానంతో తమ దగ్గర వున్న వాటిని దానం చేసేస్తుంటారు. ఏయే మాసాల్లో .. ఏయే సందర్భాల్లో ఎలాంటి దానాలు చేయాలో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయనేది శాస్త్రం చెబుతోంది.
దానం చేయడం వలన వారి పుణ్యరాశి పెరగడమే కాకుండా, వారి పూర్వీకులకి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అయితే దానం ఏదైనా అది అర్హత కలిగినవారికి చేసినప్పుడు, అది విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పబడుతుంది. సాధ్యమైనంత వరకూ దానంగా ఇచ్చిన దానిని ఎవరూ వెనక్కి తీసుకోరు. అయితే దానంగా ఇచ్చేసిన తరువాత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడం ... దానంగా ఇవ్వబడిన దాని విలువ అనూహ్యమైన రీతిలో పెరిగిపోవడం ఒక్కోసారి జరుగుతూ వుంటుంది.
అలాంటప్పుడు చాలా తక్కువమంది తాము దానంగా ఇచ్చిన దానిని తిరిగి వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడుతుంటారు. దానం ఏదైనా అది పంచభూతాల సాక్షిగా చేయడం జరుగుతుంది. కాబట్టి అలా దానంగా ఇచ్చిన దానిని తిరిగి తీసుకుంటే దాని దోషం వెంటాడుతుందని చెప్పబడుతోంది. ఆ దోషం అనేక కష్టనష్టాలకు కారణమవుతుందని స్పష్టం చేయబడుతోంది. అందువలన దానం చేసిన విషయాన్ని ఆ క్షణమే మరచిపోవాలే తప్ప, ఎలాంటి పరిస్థితుల్లోను తిరిగి ఆ వైపు దృష్టి పెట్టకూడదనేది మహర్షుల మాట.