ఉమ్మెత్త పూలతో శివార్చన ఫలితం
దోసెడు నీళ్లతో అభిషేకిస్తే సదాశివుడు సంతోషపడిపోతాడు. కాసిని అడవిపూలతో పూజిస్తే సంబరపడిపోతాడు. పత్రాలను సమర్పించినా పరవశించిపోతాడు. ఎవరు ఏది అర్పించారనేదానికన్నా, ఎంతటి ప్రేమతో సమర్పించారనేదానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. అందరికీ అందుబాటులో ఉండేవి ఆరాధనలో భాగంగా స్వీకరిస్తూ, అనంతమైన పుణ్యఫలాలను అందిస్తూ వుంటాడు.
ఈ కారణంగానే శివయ్యను వివిధ రకాల పత్రాలతో ... పుష్పాలతో పూజిస్తూ వుంటారు. ఒక్కోరకమైన పుష్పాలతో స్వామిని అర్చించడం వలన ఒక్కోఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. స్వామి నుంచి ఆయా వరాలను ఆశించేవాళ్లు, అందుకు సంబంధించిన పూలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ... తమకి సంతాన భాగ్యాన్ని కల్పించమని ఆ సదాశివుడిని చాలామంది కోరుతుంటారు. ఈ విషయంలో ఆయన మనసు గెలుచుకోవాలంటే, ఆ దేవదేవుడిని ఉమ్మెత్త పూలతో పూజించాలని చెప్పబడుతోంది. ముఖ్యంగా 'మహా శివరాత్రి' రోజున ఆ స్వామిని ఉమ్మెత్తపూలతో అర్చించడం వలన, ఆశించిన ఫలితం అనతికాలంలోనే కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.