శిరిడీసాయి మాటల్లోని పరమార్థం !
అక్కల్ కోటలో ఉంటూ తనని విశ్వసించినవారిని కాపాడుతూ వచ్చిన స్వామి సమర్థులే సాక్షాత్తు శిరిడీ సాయిబాబాగా భక్తులకు దర్శనమిచ్చాడని చెబుతుంటారు. చాలా విషయాల్లో ఇద్దరూ ఒకేలా వ్యవహరించడం ఈ విశ్వాసానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. తానే అక్కల్ కోట స్వామినని సాయిబాబా చెప్పకనే చెప్పినట్టుగా అనిపించే కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంటాయి.
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోన్న హరిశ్చంద్ర పితళే కొడుకు ఒకసారి సాయి దర్శనం చేసుకుంటాడు. తాను పడుతోన్న అవస్థలను గురించి బాబాతో చెబుతాడు. కంగారుపడవలసిన పనిలేదంటూ ఆయన అతని చేతిలో మూడు రూపాయి నాణాలను వుంచుతాడు. గతంలో తాను ఇచ్చిన రెండు రూపాయి నాణాలకు ఈ మూడు రూపాయలను కూడా చేర్చి పూజించమని చెబుతాడు. త్వరలోనే ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెబుతూ అతణ్ణి పంపించి వేస్తాడు.
గతంలో తనకి బాబా ఎప్పడు నాణాలు ఇచ్చాడో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే పితళే కొడుకు ఇంటికి చేరుకుంటాడు. అతను అదోలా వుండటం చూసి విషయమేవిటని తల్లి అడుగుతుంది. అతను బాబా మాటలను గురించి ప్రస్తావిస్తూ అయోమయాన్ని వ్యక్తం చేస్తాడు. గతంలో తాము అక్కల్ కోట స్వామిని దర్శించుకున్న సంఘటన ఆమె కళ్లముందు కదలాడుతుంది.
తమ సమస్యను విన్న అక్కల్ కోటస్వామి, పూజించుకోమని చెబుతూ రెండు రూపాయలు ఇవ్వడం ఆమెకి గుర్తుకువస్తుంది. అక్కల్ కోట స్వామియే సాయిబాబాగా భక్తులను అనుగ్రహిస్తున్నాడనే విషయం ఆమెకి అర్థమవుతుంది. అదే విషయాన్ని ఆమె కొడుకుతో చెప్పి, మరింత శ్రద్ధాసక్తులతో బాబాను ఆరాధించడం మొదలుపెడుతుంది.