సజ్జన సాంగత్య ఫలితం
లోకంలో వెలుగునీడలు ఎలా ఉంటాయో ... మంచి చెడు కూడా అలాగే వుంటాయి. ఎవరూ కూడా పుడుతూనే మంచివాళ్లు ... చెడ్డవాళ్లుగా పిలవబడరు. జీవితంలో వాళ్లు ఎంచుకున్న మార్గాలను బట్టి, వాళ్లు ఏ కోవకి చెందిన వాళ్లో చెప్పడం జరుగుతూ వుంటుంది. చెడు మార్గంలో ప్రయాణించేవారితో సన్నిహితంగా ఉండటం వలన అ ప్రభావం తప్పకుండా పడుతుంది. అలాగే మంచివారితో సన్నిహితంగా మెలగడం వలన మంచి అలవడుతుంది.
మంచి - చెడు ఎక్కడైనా వుంటాయి ... అయితే దేనిని ఎంచుకుని ఏ మార్గంలో ప్రయాణించాలనే సంస్కారం ఆయా వ్యక్తుల మనస్తత్త్వాన్ని బట్టి వుంటుంది. అయితే చెడ్డవారి సాన్నిహిత్యం లభించినంత తేలికగా మంచివారి సాన్నిహిత్యం లభించదు. అలా లభించిన సాన్నిహిత్యాన్ని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే లోకంలో సజ్జన సాంగత్యం లభించడం చాలా కష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
మంచివారి జీవన విధానం నిండుగా ... నిరాడంబరంగా ... ఇతరులకి హాని కలిగించనిదిగా వుంటుంది. వాళ్లు ఎక్కువగా దేవాలయాలకి వెళతారు ... దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవుడి లీలావిశేషాలను ... ఆయన సేవలో లభించే పరమానందాన్ని గురించే మాట్లాడుతూ వుంటారు. ఇతరులు అవసరాల్లోను ... ఆపదలోను ఉన్నప్పుడు ఆదుకుంటారు.
అలాంటివారితో సన్నిహితంగా ఉండటం వలన వాళ్లతో కలిసి ఆలయాలకి వెళ్లడం జరుగుతూ వుంటుంది. దేవుడు గురించి వాళ్లు చెప్పే నాలుగు మంచి మాటలు వినడం జరుగుతుంది. దానధర్మాల్లోను ... దైవకార్యాలలోను పాలుపంచుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. భగవంతుడి ఆరాధనలో గల ఆనందాన్ని పొందుతున్నప్పుడు, అప్పటివరకూ తాము అనుభవిస్తూ వచ్చినది నిజమైన ఆనందమేకాదనిపిస్తుంది.
ఎప్పుడైతే దేవుడికి సమీపంగా వెళుతూ ఉంటామో అప్పుడు అసురసంబంధమైన లక్షణాలు ఒక్కొక్కటిగా వదలిపోతుంటాయి. అప్పడు దేహం ... మనసు పవిత్రమై భగవంతుడి సన్నిధిలో నిలవడం జరుగుతుంది. అలాంటివారిని భగవంతుడు కరుణిస్తాడు ... మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాడు. అందుకే జ్ఞానమనే వెలుగును చూపించి ఆ మార్గంలో నడిపించే సజ్జనుల సాన్నిహిత్యాన్ని అజ్ఞానంతో ఎప్పుడూ దూరం చేసుకోకూడదని చెప్పబడుతోంది.