ఇక్కడి శివుడు ఇలా వెలుగు చూశాడట !
పరమశివుడి లీలావిశేషాలు అనంతాలు అనే విషయం ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలను బట్టి తెలుస్తూ వుంటుంది. దేవతల సంకల్పం వలన ... మహర్షుల అభ్యర్థన వలన ... భక్తుల కోరిక మేరకు ఆ మహాదేవుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవిస్తూ వచ్చాడు.
లింగరూపంలో ఆయన కొలువైన కొన్ని ప్రదేశాలు కాలక్రమంలో అనేక కారణాల వలన అంతర్హితం కావడం జరిగింది. అలాంటి చోట్ల తిరిగి వెలుగులోకి రావడానికి స్వామి చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి మహిమే మనకి 'దుబ్బ రాజేశ్వరస్వామి' విషయంలోనూ కనిపిస్తుంది. మెదక్ జిల్లా దుబ్బాక మండలం 'చౌదర్ పల్లి' లో ఈ క్షేత్రం అలరారుతోంది.
పూర్వం ఈ గ్రామనికి చెందిన ఒక వ్యక్తి, అప్పటివరకూ ఎందుకూ పనికిరాకుండా వున్న 'దుబ్బ'వంటి ప్రదేశాన్ని దున్నుతూ వుండగా, నాగలికి ఏదో అడ్డుపడగా ఎద్దులు ఆగిపోయాయట. రాయి అయ్యుంటుందని భావించి ఆయన ఎద్దులను అదిలిస్తాడు. అయినా నాగలి కదలక పోవడంతో ఆ రైతు అక్కడి మట్టిని తొలగించి చూడగా శివలింగం కనిపిస్తుంది.
నాగలి దెబ్బ కారణంగా శివలింగం నుంచి కొంచెం రక్తం వస్తుండటం చూసిన ఆయన కంగారుపడిపోతాడు. వెంటనే గ్రామంలోకి పరిగెత్తి జరిగిన సంఘటన గురించి అందరికీ చెబుతాడు. వాళ్లంతా వచ్చి అక్కడి నుంచి ఆ శివలింగాన్ని తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది. ఆ రాత్రి ఆ రైతుకి కలలో శివుడు కనిపించి ... తనకి అక్కడే ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు.
స్వామి ఆదేశం మేరకు నిర్మాణం జరుపుకున్న ఆలయమే నేడు భక్తులను దర్శనమిస్తోంది. ఇక్కడి స్వామిని భక్తులు 'రాజేశ్వరుడు'గా పూజిస్తూ వుంటారు. 'దుబ్బ'వంటి ప్రదేశంలో నుంచి బయటపడ్డాడు కాబట్టి 'దుబ్బ రాజేశ్వరుడు' గా పిలుచుకుంటూ వుంటారు. ఇక్కడి మహాదేవుడు మహిమాన్వితుడనీ ... కోరిన వరాలను ప్రసాదించే కొండంత దేవుడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.