దైవ పరీక్షలో గెలిచిన పతిభక్తి !

నర్మదాదేవికి పతిసేవ తప్ప మరోధ్యాస ఉండేది కాదు. పతిని ప్రత్యక్షదైవంగా పూజించడంలో ఆమెకి అనసూయాదేవి స్ఫూర్తి. ఆమెని దైవసమానురాలిగా నర్మద భావిస్తూ వుంటుంది. విధిఆడిన వింతనాటకం కారణంగా, మహా సౌందర్యవతి అయిన ఆమె ఒక అంధుడిని వివాహమాడుతుంది. ఆయనకి చూపు తెప్పించడం కోసం అనేక పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతూ వుంటుంది.

భర్తని ఒక బండిలో కూర్చోబెట్టుకుని దానిని లాగుతూ ఆమె అలా క్షేత్రాలకి తిరుగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలా ఒకసారి ఆమె ఒక నిర్జన ప్రదేశానికి చేరుకుంటుంది. అదే సమయంలో ఆమె భర్త తనకి దాహంగా వుందని చెబుతాడు. దగ్గరలో ఎక్కడైనా నీళ్లు వున్నాయేమోనని చూసిన ఆమెకి నిరాశే ఎదురవుతుంది.

ఆమె అనసూయాదేవి శిష్యురాలని తెలిసిన త్రిశక్తి మాతలు, ఆమెకి అనసూయాదేవి ఎలా సాయపడుతుందో చూడాలని అనుకుంటారు. నర్మదాదేవి పతిభక్తి ఎంతటిదో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నర్మదకి నీళ్లు కనిపించకుండా చేస్తారు. త్రిశక్తి మాతలే తనని పరీక్షించడానికి పూనుకున్నారనే విషయం నర్మదకి అర్థమైపోతుంది. ఇక తనని కాపాడేది ఎవరనుకుంటూ బాధపడుతుంది. ఆ ఆవేదనతో ఆమె అనసూయాదేవిని తలచుకుంటుంది.

నర్మద పతిభక్తి ... తనపై ఆమెకి గల అభిమానం అనసూయాదేవి మనసును కదిలించివేస్తాయి. అంతే ... ఆ నిర్జన ప్రదేశంలో నర్మద కూర్చున్న చోటు నుంచే జలధారలు పైకి పొంగుకొస్తాయి. ఆ నీటితో ఆమె తన భర్త దాహాన్ని తీరుస్తుంది. అనసూయాదేవికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అనసూయాదేవి పాతివ్రత్యం ... ఆమెపై నర్మదకి గల అసమానమైన విశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూసిన త్రిశక్తి మాతలు ఆశ్చర్యపోతారు.


More Bhakti News