చిన్నికృష్ణుడు స్నానం చేసింది ఇక్కడేనట !

భగవంతుడు నడయాడిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి నేలను స్పర్శించాలనిపిస్తుంది .. ఆరాధనా పూర్వకంగా కళ్లకి అద్దుకోవాలనిపిస్తుంది. అంతటి పుణ్యస్థలికి రావడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తుంటారు. ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లడానికి మనసు అంగీకరించక, అయిష్టంగానే వెనుదిరుగుతూ వుంటారు. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మనసు తెరపై మళ్లీ మళ్లీ ఆ దృశ్యాలను చూసి తరిస్తూ వుంటారు.

అంతటి అనుభూతిని అందించే ప్రదేశాల్లో 'బృందావనం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు, కృష్ణుడి ఆటపాటలతో పవిత్రమై ... ఆయన లీలావిశేషాల కారణంగా మహిమాన్వితమైన ఈ చుట్టుపక్కల ప్రదేశాలను తప్పకుండా దర్శిస్తారు. అలాంటివాటిలో ఒకటిగా 'యశోదా కుండం' కనిపిస్తుంది.

ఈ పేరు వినగానే ఈ కుండానికీ ... యశోదాదేవికి ఏదో అనుబంధం ఉందనే విషయం అర్థమవుతుంది. సాక్షాత్తు పరమాత్ముడు ... కృష్ణుడిగా జన్మించగా ఆయన బాల్యచేష్టలను ఓ తల్లిగా చూసి తరించిన మహా అదృష్టవంతురాలుగా యశోదాదేవి కనిపిస్తుంది. ఆమె ఈ కుండంలోనే చిన్ని కృష్ణుడికి స్నానం చేయించేదట. అందువల్లనే దీనిని యశోదా కుండంగా పిలుస్తుంటారు.

కన్నయ్యకి స్నానం చేయించిన కుండం అనగానే, అక్కడికి వెళ్లిన వాళ్లకి ఆ దృశ్యం కనులముందు కదలాడుతుంది. ఆ కుండంలోని నీళ్లు తలపై చల్లుకోగానే జన్మ ధన్యమైపోయినట్టుగా అనిపిస్తుంది. బాలకృష్ణుడి లీలా విశేషాలకు ... ఆయన పట్ల యశోద చూపిన ప్రేమానురాగాలకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసు పరవశిస్తుంది ... జన్మతరిస్తుంది.


More Bhakti News