గ్రహ దోషాలు నివారించే అట్ల తదియ

స్త్రీలు మాత్రమే జరుపుకునే కొన్ని ముఖ్యమైన పండుగలలో 'అట్ల తదియ' మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. 'ఆశ్వయుజ బహుళ తదియ' రోజున ఈ పండుగను జరుపుకుంటూ వుంటారు. అట్ల తదియ రోజుకి ముందురోజుని 'అట్ల తదియ భోగి'గా పిలుస్తుంటారు. ఈ రోజున ఆడపిల్లలు తలస్నానం చేసి 'గోరింటాకు' పెట్టుకుంటారు. ఆ తరువాత సంతోషంగా 'ఊయల' ఊగుతారు.

అట్ల తదియ రోజు ఉదయం ఆటపాటలతో గడిపి, సాయంత్రం వేళ చంద్రుడు ఉదయించగానే గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ కారణంగానే దీనిని 'చంద్రోదయ గౌరీ వ్రతం' అని పిలుస్తుంటారు. చంద్రోదయం వరకూ ఉపవాస దీక్షను చేపట్టి, ఆ తరువాత గౌరీదేవిని పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

బియ్యము ... మినుములు కలిపి పట్టించిన పిండితో పోసిన అట్లను అమ్మవారికి నైవేద్యం పెడుతుంటారు. ఆ తరువాత అయిదుగురికి తక్కువ కాకుండా ముత్తయిదువులను పిలిచి, ఒక్కొక్కరికి 'పది' అట్లను వాయనంగా ఇవ్వడం జరుగుతూ వుంటుంది. పసుపు - కుంకుమలు ... నల్లపూసలు ... రవికె ... దక్షిణ తాంబూలాలతో పాటు 'అట్ల'ను వాయనంగా ఇస్తుంటారు.

బియ్యం .. చంద్రుడికి సంబంధించిన ధాన్యంగా, మినుములు .. రాహువుకి సంబంధించిన ధాన్యంగా చెప్పబడుతున్నాయి. వీటిని ఉపయోగిస్తూ తయారుచేసిన అట్లను వాయనంగా ఇవ్వడం వలన ఆ గ్రహాలు శాంతిస్తాయనీ, ఫలితంగా ఆ గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయని అంటారు. ఇక 'అట్లు' అంటే 'కుజుడు'కి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.

కుజుడు అమ్మవారికి భక్తుడు ... తనకి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించేవారి పట్ల ఆయన శాంత స్వభావంతో వ్యవహరిస్తాడట. కుజ దోషం వలన వివాహం ఆలస్యం కావడం ... వైవాహిక జీవితం సంతోషకరంగా లేకపోవడం జరుగుతూ వుంటుంది. అమ్మవారిని పూజించడం వలన కుజుడు కూడా ప్రసన్నుడు అవుతాడు కాబట్టి, కుజ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతోంది.

గోరింటాకు పెట్టుకోవడం ... ఊయల ఊగడం ఆడపిల్లలకి ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక అమ్మవారిని ఆరాధించడం ... అట్లను నైవేద్యంగా పెట్టడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అమ్మవారి ఆశీస్సుల కారణంగా స్త్రీలు కోరుకునే అతి ముఖ్యమైన వివాహం ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. ఇలా 'అట్ల తదియ' అనేది అతివల ఆటపాటలకు వేదికగా అనిపిస్తుంది ... స్త్రీ జీవితం సంతోషకరంగా సాగిపోవడంలో ప్రధానమైన ప్రాతను పోషిస్తూ కనిపిస్తుంది.


More Bhakti News