కుజదోష నివారణగా కాటుక !
ప్రాచీన కాలం నుంచి ఆడపిల్లల జీవితంలో కాటుక ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తోంది. పసివయసులో ఉన్నప్పటి నుంచి ఆడపిల్లలు కాటుకతో విడదీయరాని సంబంధాన్ని కలిగి వుంటారు. పసిపిల్లలకి పాదాల్లోను ... చెక్కిలిపైన కాటుకతోనే 'దిష్టిచుక్క' పెడుతుంటారు. ఇక వాళ్లని పెళ్లికూతురుగా చేసినప్పుడు కూడా 'బుగ్గచుక్క'గా కాటుక ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.
ఇక బాల్యం నుంచి ముత్తయిదు జీవితాన్ని గడుపుతున్నంత కాలం స్త్రీలు కళ్లకి కాటుకను ధరిస్తూనే వుంటారు. ఆధునీకత పేరుతో ఈ రోజుల్లో కాటుకను ధరించేవారి సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ పూర్వం ఆడపిల్లలు తప్పనిసరిగా కాటుకను ధరించేవారు. పొరపాటున కాటుక పెట్టుకోవడం మరిచిపోతే వెంటనే మన ఆచారాన్ని గుర్తుచేస్తూ పెద్దలు మందలించేవాళ్లు.
ప్రతిరోజు కాటుకను ధరించడం వలన, కళ్లు విశాలంగా అందంగా రూపుదిద్దుకుంటాయట. ముఖ సౌందర్యాన్ని కాటుక రెట్టింపు చేస్తుందని భావించేవాళ్లు. అంతే కాకుండా నేత్ర సంబంధిత వ్యాధులను కాటుక దూరంగా ఉంచుతుందని చెబుతుంటారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న కాటుక, గ్రహ సంబంధిత దోషాలను కూడా పోగొడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
సాధారణంగా 'కుజదోషం' అనేది స్త్రీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ కుజ దోషం కారణంగా అనేక సమస్యలు ఆమె జీవితంపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా వివాహం విషయంలో ఆలస్యం కావడం ... వివాహమైతే వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడం జరుగుతూ వుంటాయి. ఈ రెండు సమస్యలు స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవే. అందువలన కుజదోషం నుంచి బయటపడటానికి వాళ్లు వివిధరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో 'కుజదోషం'తో బాధలు పడుతోన్న అమ్మాయిలు కాటుక ధరించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది. కొంతమందికి తమకి కుజ దోషం ఉందనే విషయం కూడా తెలియదు. అలాంటి వాళ్లకి కాటుక ధరించే అలవాటు వుంటే, సహజంగానే ఆ దోష ప్రభావం క్రమేపి తగ్గుముఖం పడుతుంది. ఇక తమకి కుజదోషం వుందని తెలిసిన వాళ్లు అనునిత్యం కాటుక ధరిస్తూ వుండటం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.