ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలి
జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా ధైర్యంతో దానిని ఎదుర్కోవచ్చు. కానీ ఆ ధైర్యాన్నే దెబ్బతీసే సమస్యలు కూడా ఒక్కోసారి ఎదురవుతూ వుంటాయి. ఇలాంటి సమస్యల్లో ప్రధానమైనదిగా ఆర్ధికపరమైన సమస్యను గురించి చెప్పుకోవచ్చు. ఎంతటి ధైర్యవంతుడినైనా మానసికంగా కుంగిపోయేలాచేసే శక్తి ఆర్ధికపరమైన సమస్యకి వుంటుంది.
అందుకే ఎవరికి వాళ్లు తమ ఆర్ధిక పరిస్థితి విషయంలో ఎంతో జాగ్రత్తను వహిస్తుంటారు. తమ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమని భావించి, ఆ తల్లికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన రోజుల్లో అమ్మవారిని పూజించడం వలన ఆమె అనుగ్రహం వెంటనే లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలాంటి రోజుల్లో ఒకటిగా 'ఆశ్వయుజ పౌర్ణమి' కనిపిస్తుంది. దీనినే 'కౌముదీ పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న ఈ రోజున, ఉదయాన్నే తలస్నానం చేసి ... పూజా మందిరంలోని అమ్మవారిని అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. అమ్మవారికి సంబంధించిన పారాయణాలు ... భజనలతో 'జాగరణ' చేయాలి.
ఈ రోజున రాత్రి వేళలో అమ్మవారు తప్పనిసరిగా సంచరిస్తుందట. ఈ సమయంలోనే అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తుందనీ ... ఐశ్వర్యంతో పాటు దానిని అనుభవించే ఆయురారోగ్యలను కూడా ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది. అందరూ కోరుకునేది సిరి సంపదలతో ... సుఖశాంతులతో కూడిన జీవితమే కనుక, లక్ష్మీదేవి మనసు గెలుచుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తీరాలి.