ఆపదలను అడ్డుకునే ఆంజనేయుడు
భగవంతుడు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అవసరాల నుంచి ... ఆపదల నుంచి వాళ్లను గట్తెక్కిస్తూ వుంటాడు. ఎంతోమంది మహా భక్తుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి 'తులసీదాస్' జీవితంలోను కనిపిస్తుంది.
'రామచరిత మానస్' ను రచించిన తులసీదాస్ కి కాశీ విశ్వనాథుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎక్కడ చూసినా అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటూ వుంటారు. ఆయన భక్తి శ్రద్ధలను గురించీ ... ఆయన రచనలోని గొప్పతనం గురించి చెప్పుకుంటూ వుంటారు.
తులసీదాస్ కి దక్కుతోన్న ప్రశంసలు కొందరికి అసూయ ద్వేషాలను కలిగిస్తాయి. దాంతో వాళ్లంతా ఒక బృందంగా ఏర్పడి ఒక తాంత్రికుడిని కలుసుకుంటారు. తులసీదాస్ ని ఏదో ఒకటి చేయవలసిందేనని ఆయనతో చెబుతారు. ఆయన ఒక దుష్టశక్తిని తులసీదాస్ పైకి ప్రయోగిస్తాడు. తులసీ దాస్ ఆశ్రమంలోకి ప్రవేశించబోయిన ఆ శక్తిని హనుమంతుడు అడ్డుకుంటాడు.
ఆంజనేయుడి పేరు వింటేనే హడాలిపోయే ఆ దుష్టశక్తి, సాక్షాత్తు ఆయనే తులసీదాస్ ఆశ్రమాన్ని రక్షిస్తూ వుండటం చూస్తుంది. భయంతో వెనుదిరిగిన ఆ దుష్టశక్తి, తనని ప్రయోగించిన తాంత్రికుడిపైనే తన ప్రతాపాన్ని చూపుతుంది. దాంతో ఆ పనిని ఆయనకి పురమాయించిన వాళ్లంతా తలో దిక్కుకి పారిపోతారు. తాను ప్రయోగించిన దుష్ట శక్తి తనపైనే తిరగబడటానికి గల కారణం తెలుసుకున్న ఆ తాంత్రికుడు ఆ ఊరు విడిచి వెళ్లిపోతాడు.