సప్తమి నుంచి అమ్మవారి ఆరాధన
సాధారణంగా శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతూ వుంటాయి. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో రూపాన్ని ధరించి, భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అమ్మవారిని ఆరాధించే భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు ఒకపూట మాత్రమే భోజనం చేయడమనేది నియమంగా కనిపిస్తుంది.
ఇలా తొమ్మిది రోజులు చేయలేనివాళ్లు 'సప్తమి' .. 'అష్టమి ' .. 'నవమి' రోజులలో అమ్మవారిని ఆరాధించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రులలో ఏడవ రోజున అమ్మవారు 'కాళరాత్రి దుర్గ' రూపంలో ... మొగలిపూల అలంకరణతో దర్శనమిస్తుంది. గాడిదను వాహనంగా కలిగిన ఈ అమ్మవారికి వివిధ రకాల కూరగాయ ముక్కలను కలిపి వండిన అన్నం నైవేద్యంగా సమర్పించబడుతుంది. శత్రువులను భయకంపితులను చేసే ఈ తల్లి తన భక్తులకు సకల శుభాలను ప్రసాదిస్తుందని చెబుతారు.
అలాగే 'అష్టమి' రోజున అమ్మవారు 'మహాగౌరి' రూపంలో భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంది. ఎద్దును వాహనంగా కలిగి వున్న ఈ అమ్మవారిని గులాబీలతో అలంకరించి ... ఆమెకి ఎంతో ప్రీతికరమైన 'చక్కెర పొంగలి'ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక 'నవమి' రోజున అమ్మవారు 'సిద్ధి ధాత్రి'గా భక్తుల మనసు దోచుకుంటుంది. కమలాన్ని ఆసనంగా చేసుకున్న ఈ అమ్మవారిని మరువాలు ... దవనాల మాలికలతో అలంకరిస్తూ వుంటారు.
దసరా నవరాత్రులలో నవమి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తుంది. విజయదశమి రోజున పునః పూజ చేసి ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమైన పూజను నవమి రోజునే చేయవలసి వుంటుంది. ఈ రోజున దర్శనమిస్తోన్న అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఈ విధంగా నవరాత్రులలోని చివరి మూడురోజుల్లో అమ్మవారిని అంకిత భావంతో ఆరాధించడం వలన, పాపాలు ... దోషాలు ... వ్యాధులు నశించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.