కాత్యాయనీదేవి ఇలా కరుణిస్తుంది
జగన్మాత అయిన అమ్మవారు ధరించిన నవదుర్గా రూపాలలో 'కాత్యాయనీదేవి' రూపం ఒకటిగా కనిపిస్తుంది. నవరాత్రులలో ఆరవరోజున అమ్మవారు కాత్యాయనీదేవిగా భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది. ఒకసారి 'కాత్యాయన మహర్షి' అమ్మవారి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది.
లోకాలను ఏలే ఆ తల్లిని కూతురుగా పొందాలని వుందనీ, అంతటి భాగ్యాన్ని తనకి కలిగించమని కోరతాడు కాత్యాయన మహర్షి. అందుకు సంతోషంగా అంగీకరించిన అమ్మవారు ఆయన ముచ్చట తీరుస్తుంది. అలా కాత్యాయన మహర్షి కూతురుగా జన్మించిన కారణంగా అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది.
నవరాత్రులలో ఆరో రోజున అమ్మవారు ఈ నామంతో ... ఈ రూపంతో భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. సింహ వాహనాన్ని అధిష్ఠించిన అమ్మవారు ... తన బిడ్డల వంటి భక్తుల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదన్నట్టుగా చేతిలో ఖడ్గంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ అమ్మవారిని మందార పుష్పాలతో అలంకరిస్తూ వుంటారు.
అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమని చెప్పబడుతోన్న 'కేసరీ బాత్' ను ఈ రోజున నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అమ్మవారి మనసు తెలుసుకుని పూజించడం వలన ఆ తల్లి వెంటనే కరుణిస్తుందనడానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో కాత్యాయనీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.