గర్భాలయంలోని దేవుడు ఇలా మాయం !
సాధారణంగా గర్భాలయంలో గల పంచలోహ మూర్తులు కనిపించకపోతే, ఎవరైనా దొంగలు దోచుకుపోయి ఉంటారని భావించడం జరుగుతూ వుంటుంది. కానీ మూల మూర్తిగా భావించే అసలు విగ్రహమే కనిపించకుండాపోతే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఇలా అందరినీ ఆశ్చర్యచకితులను చేసే పనులు ఎక్కువగా అల్లరి కృష్ణుడే చేస్తుంటాడు.
ఆయన చేసిన కొన్ని లీలలకు 'బృందావనం' వేదికంగా కనిపిస్తూ వుంటుంది. కృష్ణ భక్తుడు అయినటువంటి 'హరిదాసు'కు ఇక్కడి 'నిధివనం'లో ఒక కృష్ణుడి ప్రతిమ దొరుకుతుంది. స్వామి స్వప్న సందేశం మేరకే అది ఆయనకి లభిస్తుంది. మనోహరమైన ఈ విగ్రహానికి ప్రాణం వుందని భావించిన ఆయన, ఇక ప్రాణప్రతిష్ఠ అవసరంలేదని భావించి, ఆలయాన్ని నిర్మించి గర్భాలయంలోని వేదికపై దానిని వుంచి పూజిస్తాడు.
అలాంటి ఈ ప్రతిమ ఒకసారి కనిపించకుండాపోతుంది. స్వామి ఏమయ్యాడో తెలియక అర్చకులు ఆదుర్దాపడతారు. అంతకుముందు ఒక కృష్ణ భక్తురాలు వచ్చి వెళ్లిందని తెలుసుకుని, ఆ మార్గంలో వెదకడం మొదలుపెడతారు. నిజంగానే ఆ మార్గంలో వారికి అక్కడక్కడా రాలిపడిన కృష్ణుడి కాలి మువ్వలు కనిపిస్తాయి. దాంతో కృష్ణుడు ఆ భక్తురాలివెంట వెళ్లి ఉంటాడని భావించి ఆమెని కలుసుకుంటారు. జరిగిన సంఘటన గురించి ఆమెకి వివరిస్తారు.
ఆ స్వామి తనని అదృశ్య రూపంలో అనుసరిస్తూ వస్తున్నాడని ఆమె భావిస్తుంది. తాను ఆలయానికి వచ్చినప్పుడు స్వామికి నమస్కరిస్తూ, ఆయన తన వెంటవస్తే బాగుండునని అనుకున్నాననీ, అందుకే అలా జరిగి ఉంటుందని అంటుంది. స్వామివారిని తిరిగి ఆలయానికి చేరుకోవలసిందిగా ఆమె ప్రార్ధించడంతో ఆయన తిరిగి ఆలయంలో ప్రత్యక్షమైనట్టుగా ఇక్కడ చెప్పుకుంటూ వుంటారు.
ఇలాంటి లీలలు ఎన్నో చేసిన ఆ స్వామిని ఇప్పటికీ ఇక్కడి 'బాంకే బిహారీ' ఆలయంలో చూడవచ్చు. మహిమాన్వితమైన ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే మనసు పరవశిస్తుంది. ఆ స్వామి దర్శనం కోసం పదే పదే పరితపిస్తుంది.