ఆర్తితో పిలిస్తే ఆదుకునే అమ్మవారు
లోకంలో దుష్టుల వలన సాధుజనుల జీవనవిధానానికి ఆటంకాలు ఎదురైనప్పుడల్లా అమ్మవారు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే వుంది. దుష్ట శిక్షణ చేసి సాధుసజ్జనులను కాపాడుతూనే వుంది. అందుకే తమకి ఎలాంటి కష్టం వచ్చినా ఆ తల్లి తప్పక వచ్చి రక్షిస్తుందనే బలమైన విశ్వాసంతో భక్తులు వుంటారు.
అమ్మవారు కూడా వాళ్ల విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లోను బలహీనపడకుండా చూసుకుంటూ వుంటుంది. వాళ్లు ఆర్తితో పిలిచినదే తడవుగా ఆదుకుంటూ వుంటుంది. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న అమ్మవారి ఆలయాలలో 'పోలమాంబ' ఆలయం ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. విజయనగరం జిల్లా 'శంభర' గ్రామంలో ఈ ప్రాచీన క్షేత్రం అలరారుతోంది.
ప్రాచీనకాలంలో 'శంభరాసురుడు' అనే రాజు ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేదట. ఆయన ఇక్కడి ప్రజలను నానావిధాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఆయన ఆగడాలు శృతిమించడంతో భరించలేకపోయిన ప్రజలు, తమని ఆయన బారి నుంచి కాపాడమని పార్వతీదేవిని ప్రార్ధిస్తారు. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ప్రత్యక్షమై శంభరాసురుడిని సంహరిస్తుంది. అక్కడి ప్రజలకు సుఖశాంతులను ప్రసాదిస్తుంది.
ఈ కారణంగానే ఈ గ్రామం 'శంభర' అనే పేరుతోను ... ఇక్కడి అమ్మవారు 'శంభర పోలమాంబ' గాను పిలవబడుతుంటారు. చల్లని మనసున్న ఈ తల్లిని దర్శిస్తే కోరిన వరాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయురారోగ్యలను ... సంతాన సౌభాగ్యాలను అందిస్తుందని అంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భారీసంఖ్యలో పాల్గొని ఆ తల్లికి సంతోషాన్నీ ... సంతృప్తిని కలిగిస్తుంటారు.