కూష్మాండ దుర్గకి ప్రీతికరమైన నైవేద్యం

దేవీ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రూపంలో ఒక్కో నామంతో దర్శనమిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కో అమ్మవారికి ఒక్కో నైవేద్యం ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. శైలపుత్రికి 'కట్టుపొంగలి' ... బ్రహ్మచారిణికి 'పులిహోర' ... చంద్రఘంటాదేవికి 'కొబ్బరి అన్నం' నైవేద్యంగా సమర్పించిన భక్తులు, కూష్మాండ దుర్గకి 'అల్లంగారెలు' నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే ఈ గారెలకి రంధ్రాలు చేయకూడదనే నియమం కనిపిస్తుంది.

నవరాత్రులలో నాల్గొవ రోజున అమ్మవారిని 'కూష్మాండ దుర్గ' గా అలంకరించి పూజిస్తుంటారు. ఈ అమ్మవారు పులిని వాహనంగా కలిగి వుంటుంది. అమ్మవారికి గల ఎనిమిది చేతులు ఆమె శక్తికి నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఎనిమిది చేతుల్లో విల్లు .. బాణం .. చక్రం .. గద .. తామరపువ్వు .. జపమాల .. కమండలం .. అమృత కలశం కనిపిస్తూ వుంటాయి.

చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి వదనం ప్రసన్నంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి ఈ తల్లికి అల్లం గారెలు అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. సన్నజాజి పూలమాలికలతో అమ్మవారిని అలంకరించి ... ఆరాధించి .. ఆమెకి ఇష్టమైన అల్లం గారెలను నైవేద్యంగా పెట్టడం వలన ఆ తల్లి సంతోషిస్తుందని చెబుతారు. ఈ అమ్మవారి అనుగ్రహం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News