అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే కలిగే ఫలితం !
సాధారణంగా ఏదైనా క్షేత్రానికి వెళితే అక్కడి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ తరువాత దైవదర్శనం చేసుకోవడం జరుగుతూ వుంటుంది. ప్రదక్షిణ వలన సమస్త పాపాలు నశిస్తాయని చెప్పబడుతోంది. అందువలన భక్తులు ఈ ప్రదక్షిణలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు.
ఇక కొన్ని క్షేత్రాలు కొండప్రదేశాల్లో దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రానికి వెళ్లిన భక్తులు అందుకు సంబంధించిన కొండచుట్టూ కూడా మహా ప్రదక్షిణ చేస్తుంటారు. అలా కొండచుట్టూ మహా ప్రదక్షిణ చేయబడే విశిష్టమైన క్షేత్రాల్లో 'అరుణాచలం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. పంచభూత లింగాలలో ఒకటైన 'తేజోలింగం' ఇక్కడ దర్శనమిస్తూ వుంటుంది.
సాధారణ రోజుల్లో కంటే, 'పౌర్ణమి' రోజున ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే పౌర్ణమి రోజున రాత్రి 'అరుణగిరి' ప్రదక్షిణ చేయడం వలన, సాక్షాత్తు మహాశివుడుకి ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది. అందువలన స్వామి దర్శనానికి వచ్చే భక్తులు అరుణగిరికి మహా ప్రదక్షిణ చేస్తుంటారు.
పధ్నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలత గల ఈ కొండను ప్రదక్షిణ పూర్వకంగా ఎలాంటి భయం లేకుండా చుట్టిరావచ్చు. ఎందుకంటే శివనామ స్మరణ చేస్తూ ముందుకుసాగే భక్తజన సందోహం ఉండనే వుంటుంది. ఈ ప్రదక్షిణ క్రమంలో కొలువైన ఆలయాలను దర్శిస్తూ ... పౌర్ణమి వెన్నెల్లో అరుణాచలేశ్వరుడిని స్మరిస్తూ వెళుతూ ఉండటం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుంది.