అదే ఆయనలోని గొప్పతనం !

నరేంద్రుడు ... వివేకానందుడుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేవరకూ గల పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. బాల్యం నుంచి కూడా ఆయన ఆలోచనా విధానం ... ప్రవర్తించే తీరు మిగతా పిల్లలకు భిన్నంగా ఉండేది. ఆయనలోని అసాధారణ శక్తిని ముందుగా గుర్తించినది రామకృష్ణపరమహంసనే.

తన ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచమంతటా వినిపించడానికి రామకృష్ణపరమహంస ఎన్నుకున్న శక్తిమంతమైన ఆయుధమే వివేకానందుడుగా కనిపిస్తాడు. తనపట్ల గురువుకి గల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఆయనపడిన ఆరాటం అంతా ఇంతా కాదు. గురువుగారి ఆధ్యాత్మిక సందేశంతో పాటు, ఆధునిక యుగంలో యువత పాత్రను గుర్తించి వారిలోని శక్తిని మేల్కొల్పడంలో ఆయన ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన విదేశీ పర్యటనలు ఎక్కువగా చేసేవాడు.

ఒకసారి విదేశానికి వెళ్లిన ఆయన ప్రశాంతంగా వున్న ఒక ప్రదేశంలో పచార్లు చేయసాగాడు. అదే సమయంలో కొంతమంది యువలు అటుగా వస్తారు. తమ వస్త్రధారణకు పూర్తి భిన్నంగా వున్న ఆయన వేషధారణను చూసి ఎద్దేవా చేయడం మొదలుపెడతారు. వివేకానందుడు సహనాన్ని పాటిస్తున్నా కొద్దీ వాళ్ల ధోరణి శృతిమించసాగింది. దాంతో నిదానంగా ... గంభీరంగా ఆయన వాళ్లని సమీపిస్తాడు. ఆయన తీక్షణమైన చూపులను తట్టుకోలేక వాళ్లు నేలచూపులు చూస్తుంటారు.

వ్యక్తిత్వాన్నిబట్టే తప్ప .. వస్త్రధారణను బట్టి విలువనివ్వడం తన దేశంలో జరగదనీ, వాళ్ల ధోరణి చూస్తుంటే అక్కడ వస్త్రధారణకి మాత్రమే విలువనిస్తారనే విషయం అర్థమవుతోందని అంటాడు. వ్యక్తిత్వం గలవారే వ్యక్తిత్వం వున్నవారిని గుర్తించగలుగుతారని చెబుతాడు. ఇకనైనా వస్త్రధారణకు మాత్రమే విలువనివ్వడం మానుకుని, దేశ గౌరవాన్ని నిలబెట్టే దిశగా ఆలోచనచేస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగమని చెబుతాడు. ఆ మాటలకి బిత్తరపోయిన ఆ యువకులు ఆయనకి క్షమాపణ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.


More Bhakti News