అరటిపండ్లు అంటే ఈ స్వామికి ఇష్టమట !
భగవంతుడికి పూజ అనేది ఎంతో సంతోషంగా చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మొక్కుబడిగా ... యాంత్రికంగా పూజ చేయడం వలన సమయం వృథా అవుతుందే తప్ప, ఎలాంటి ప్రయోజనం వుండదు. పూజా మందిరం చూడగానే ఆ ఇంటివారి ఇష్టదైవం ఎవరో చెప్పవచ్చు. అలాగే వాళ్లకు గల భక్తిశ్రద్ధల గురించి కూడా చెప్పవచ్చు.
ఎందుకంటే భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలు ... ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడే పూజను అంకితభావంతో చేయగలుగుతారు. అప్పుడే పూజా మందిరం అందమైన అలంకరణలతో ... పూల మాలికలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. భగవంతుడి పట్ల ఇష్టమే ఆయన ఇష్టాలను తెలుసుకునేలా చేస్తుంది. అప్పుడే ఆ దైవానికి ప్రీతికరమైన పూలను ... నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది.
భగవంతుడి మనసు గెలుచుకోవడంలో 'నైవేద్యం' కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం వలన ఆయన వెంటనే ప్రీతిచెందుతాడు. దత్తాత్రేయస్వామి విషయానికే వస్తే, ఆయనని పూజించడం వలన త్రిమూర్తులను ప్రత్యక్షంగా ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. అలాంటి దత్తాత్రేయస్వామికి 'అరటిపండ్లు' ఇష్టమైన నైవేద్యంగా చెప్పడం జరుగుతోంది.
ఆ స్వామిని ఆప్యాయంగా ఆహ్వానించాలి ... ఆయనకి ఆనందంగా అభిషేకాలు నిర్వహించాలి. వివిధరకాల పుష్పాలతో అలంకరించి ... అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది. ఆ తరువాత దత్త పారాయాణం ... భజనలు చేయవలసి వుంటుంది. ఈ విధంగా దత్తుడిపట్ల ప్రేమానురాగాలను చాటుకోవడం వలన, ఆశించిన దానికంటే వేగంగా ఆయన అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతోంది.