ఈ క్షేత్రానికి వెళ్లాలని అనుకుంటే చాలు
నిత్యజీవితంలో ఎవరి పనుల్లో వాళ్లు తీరికలేకుండా వుంటారు. ఎప్పుడైనా కాస్త తీరిక దొరికితే ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్లిరావాలని అనుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశించిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. క్రితం జన్మలో చేసిన పాపాలు ... తెలిసీ తెలియక ఈ జన్మలో చేసిన పాపాల ఫలితాలు ఏదో ఒక విధంగా పీడిస్తూ వుంటాయి.
అలాంటి పాపాల బారి నుంచి బయటపడటానికి పుణ్యక్షేత్ర దర్శనానికి మించిన మార్గం లేదు. అందుకే బాధ్యతల నుంచి కాస్త విశ్రాంతి లభిస్తే చాలు ... పుణ్యక్షేత్రాలకి వెళ్లడానికే చాలామంది ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా ఏదైనా క్షేత్రానికి చేరుకొని, అక్కడి దైవదర్శనం లభించిన తరువాత ఆ దైవం అనుగ్రహంతో పాపాలు నశిస్తూ వుంటాయి.
ఫలానా పుణ్యక్షేత్రానికి వెళదామని అనుకుని అక్కడికి బయలుదేరుతుండగానే పాపాలు నశించే మహిమాన్విత క్షేత్రాలు కూడా కొన్ని దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో 'నైమిశారణ్యం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలని అనుకోగానే అప్పటి వరకూ పీడిస్తూ వస్తోన్న పాపాల ఫలితాలు కనుమరుగైపోతాయట. ఎంతోమంది దేవతలు ... మహర్షులు నడయాడిన ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టడానికి పూర్వజన్మ సుకృతం వుండాలి.
ఒకసారి మహర్షులంతా కలిసి సమస్త లోకాలలో అత్యంత పవిత్రమైన పుణ్యతీర్థం ఎక్కడుందో చెబితే అక్కడ తపస్సు ... యజ్ఞ యాగాలు చేసుకుంటామని బ్రహ్మదేవుడిని కోరారట. దాంతో ఆయన తన మనసు నుంచి ఒక చక్రాన్ని సృష్టిస్తాడు. ఆ చక్రం ఎక్కడైతే పడుతుందో దానిని మించిన పుణ్యతీర్థం మరొకటి లేదని భావించమని చెప్పి ఆ చక్రాన్ని అనుసరించమని అంటాడు.
ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరిగా భూలోకానికి చేరుకొని ఈ ప్రదేశంలో పడుతుంది. అప్పటి నుంచి ఇది మహర్షుల తపస్సులతో ... యజ్ఞయాగాలతో మరింత పవిత్రమవుతూ వస్తోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి వెళదామనే ఆలోచన కలగడంతోనే పాపాల ప్రక్షాళన జరిగిపోతుందని సాక్షాత్తు సూత మహర్షి చెప్పడం జరిగింది. అందుకే ఇది మహిమాన్విత క్షేత్రమై అలరారుతోంది ... విశిష్ట క్షేత్రమై విలసిల్లుతోంది.