వైభవాన్ని చూపే వేంకటేశ్వరుడు
తిరుమలలో ఆవిర్భవించిన వేంకటేశ్వరుడుని దర్శించిన వాళ్లు సమ్మోహనకరమైన ఆ రూపాన్ని మరిచిపోలేరు. దర్శనమైపోయింది కదా అనిచెప్పేసి భక్తులు వెంటనే వెనుదిరగలేరు. ఎందుకంటే ఏదో తెలియని బంధం వెనక్కిలాగుతూ ఉంటుంది. వచ్చినంత సంతోషంగా ఆ స్వామి నడయాడిన క్షేత్రాన్ని విడిచివెళ్లడం సాధ్యం కాదు.
ఆ దివ్య మంగళమూర్తిని మళ్లీ ఎప్పటికి చూడటం కుదురుతోందో ... అప్పటివరకూ ఆయన ఎడబాటుని ఎలా భరించాలోనని ప్రతి ఒక్కరూ బాధపడుతుంటారు. దూరప్రాంతాలలో వున్నవాళ్లు ఆ స్వామి దర్శనాన్ని నిత్యం చేసుకోలేరు. అందువలన అంతాకలిసి తమకి దగ్గరలో ఆలయాన్ని నిర్మించి, తిరుమల వేంకటేశ్వరుడిని పోలిన మూర్తిని ప్రతిష్ఠించుకున్న తీరు మనకి కనిపిస్తూ ఉంటుంది.
అలాగే ఇతరదేశాల్లో వున్న వాళ్లు ఒక సంఘంగా ఏర్పడి స్వామివారి ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించుకుని ... ఆ శ్రీనివాసుడిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజించుకుంటూ వుంటారు. ఇలా ఆ స్వామిని సేవిస్తూ ... తిరుమలలో వున్న అనుభూతిని పొందుతూ వుంటారు. ఈ విధంగా విదేశాల్లో కొలువైన వేంకటేశ్వరస్వామి ఆలయాలో 'పిట్స్ బర్గ్' లోని ఆలయం ముందువరుసలో కనిపిస్తుంది.
అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఆ స్వామివారిపట్ల గల భక్తి విశ్వాసాలతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారు. అలా 1976 లో నిర్మించబడిన ఈ ఆలయం స్వామివారి వైభవాన్ని చాటుతూ ఉంటుంది. ఇక్కడి వాళ్లు తిరుమల వచ్చి వేంకటేశ్వరుడిని దర్శిస్తూనే వుంటారు. కానీ ఆయన మీద బెంగ కలిగినప్పుడు వెంటనే దర్శించుకోవడానికి వీలుగా వాళ్లు ఆయనకి ఆలయాన్ని నిర్మించారు.
అసలైన ఆనందాన్ని కలిగించేది ఆ స్వామి వైభవమేనని భావించిన భక్తులు ఆయనకి అన్ని రకాల సేవలు జరిగేలా చేస్తుంటారు. ప్రశాంతతకు ... పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ... భక్తి శ్రద్ధలను వైభవంగా ఆవిష్కరిస్తూ వుంటుంది. భారతీయుల ఆధ్యాత్మిక సంపదగా అలరారుతూ ఉంటుంది.