చంద్రఘంటాదేవి పూజా ఫలితం !
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం ఒక్కో రూపాన్ని ధరించి ఒక్కో అసురుడిని సంహరిస్తూ వచ్చింది. అమ్మవారు ధరించిన ఆ రూపాలు శరన్నవ రాత్రులలో నవదుర్గా రూపాలుగా పూజలు అందుకుంటున్నాయి.
నవరాత్రులలో మొదటిరోజున 'శైలపుత్రి' గాను ... రెండవరోజున 'బ్రహ్మచారిణి' గాను అలంకరించబడి పూజలు అందుకున్న అమ్మవారు, మూడవరోజున 'చంద్రఘంటాదేవి'గా అలంకరించబడి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. శిరస్సుపై చంద్రుడిని ధరించిన కారణంగా ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవిగా కొలుస్తుంటారు.
తన భక్తులను రక్షించడం కోసం ఈ అమ్మవారు 'పులి' వాహనాన్ని అధిష్టించి తిరుగుతూ వుంటుంది. చంద్రఘంటాదేవికి కొబ్బరితో కలిపి వండిన అన్నమంటే ఇష్టమట. అందువలన ఆ తల్లికి దానిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ అమ్మవారిని దర్శించడం వలన ... పూజించడం వలన భూతప్రేత పిశాచాది భయాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
భూత ప్రేత పిశాచాది భయాలు కొంతమందికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. నిజానికి ఈ సమస్య ఇతరులకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. దాని బారి నుంచి బయటపడటం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్య ఔషధ పరమైన వైద్యం వలన తొలగిపోయేది కాదు కాబట్టి, బాధితులను ఆయా క్షేత్రాలకి తీసుకు వెళ్లడం ... అక్కడి దైవాలకు వివిధ రకాల మొక్కులు మొక్కుకోవడం చేస్తుంటారు.
ఈ రకమైన సమస్య నుంచి బయటపడటానికీ, మున్ముందు ఇలాంటి భయాలు ఎదురుకాకుండా ఉండటానికి 'చంద్రఘంటాదేవి'ని పూజించాలనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన భూతప్రేత పిశాచాది భయాలు ... బాధలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.