గౌరీశంకర రుద్రాక్ష ధారణ ఫలితం !
గౌరీ శంకరులు ... ఉమా మహేశ్వరులు ... శివపార్వతులు అని ఆదిదంపతులను పిలుచుకోవడం ... కోలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి పేరు ... స్వామివారి పేరు విడదీయడానికి వీలులేనంతగా కలిసిపోయి కనిపిస్తుంటాయి. ఈ పేర్లలోనే అర్థనారీశ్వర తత్త్వం కనిపిస్తూ వుంటుంది.
ఈ పేర్ల మాదిరిగానే ... అర్థనారీశ్వర రూపం మాదిరిగానే రెండు రుద్రాక్షలు కొంతభాగం కలిసిపోయి ఒక రూపంగా కనిపిస్తూ ఉంటాయి. దీనినే 'గౌరీశంకర రుద్రాక్ష'గా పిలుస్తుంటారు. నూతన వధూవరుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేయడం కోసం ఈ రుద్రాక్షను ధరింపజేయవలసి ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
భార్యాభర్తల మధ్య ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరి అలవాట్లను ... అభిరుచులను ... నిర్ణయాలను మరొకరు గౌరవిస్తూ వుండాలి. కొన్ని విషయాల్లో ఒకరి ధోరణి మరొకరికి కాస్త కష్టం కలిగించినా సహనంతో సర్దుకుపోవాలి. సుఖాల్లోనే కాదు కష్టాలలోను ఒకరికి ఒకరు అండగా నిలవాలి.
అప్పుడే అన్యోన్య దాంపత్యానికి నిర్వచనంగా నిలవగలుగుతారు. లేదంటే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఒకరికి ఒకరు సహరించుకోకపోవడం వలన జీవితం గాడి తప్పుతుంది. ఇలాంటి సమస్య ఎక్కువగా కొత్తగా పెళ్లైన జంటల్లో కనిపిస్తూ వుంటుంది. అందువలన ఇద్దరిచే తొమ్మిది ముఖాలు కలిగిన గౌరీశంకర రుద్రాక్షను ధరింపజేయాలని శాస్త్రం చెబుతోంది.
శివపార్వతులు ఆదర్శవంతమైన దంపతులు ఎలా ఉండాలనేది లోకానికి చాటి, ఆదిదంపతులుగా పూజలు అందుకుంటున్నారు. అలాంటి గౌరీశంకరులకు ప్రతీకగా ఈ 'గౌరీశంకర రుద్రాక్ష' చెప్పబడుతోంది. ఈ రుద్రాక్ష ధారణ వలన ఆలుమగల మధ్య అన్యోన్యత పెరుగుతుందని స్పష్టం చేయబడుతోంది.