ఈ రోజున లలితాదేవిని పూజించాలి
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు 'లలితాదేవి' గా ఆవిర్భవించి భక్తులచే విశేష పూజలు అందుకుంటూ ఉంటుంది. ఎవరైతే తనని నిత్యం ఆరాధిస్తూ ఉంటారో వారిని అమ్మవారు కనిపెట్టుకుని ఉంటుందని అంటారు. అమ్మవారి నామమే దుష్ట శక్తుల పాలిట ఆయుధమవుతుంది. అమ్మవారి దర్శనమే సమస్త పాపాలను హరించి వేస్తుంది.
తన భక్తులు అనారోగ్యాల బారిన పడకుండా ... ప్రమాదాలకి గురి కాకుండా ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. తన భక్తుల ఇంట లేమి అనేది లేకుండా చేసి ... వాళ్లకి సమస్యలను దూరం చేసి సంతోషాలను చేరువచేస్తుంది. అలాంటి లలితాదేవిని వ్రత విధానం ద్వారా ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. దీనినే 'ఉపాంగా లలితా వ్రతం' అని అంటారు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అమ్మవారి కృపాకటాక్షాలు దక్కుతాయనీ, ఫలితంగా సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్లు సూర్యోదయ సమయానికి చవితి వుండి, రాత్రి సమయానికి పంచమి ఉండేలా చూసుకోవాలని చెప్పబడుతోంది.
ఈ రోజంతా కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ... పారాయణాలు చదువుకోవాలనీ, భజనలు చేయాలని శాస్త్రం చెబుతోంది. ఉపవాస దీక్షను చేపట్టి .. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ... జాగరణ చేసినప్పుడు వ్రత ఫలితం పరిపూర్ణంగా దక్కుతుందని చెప్పబడుతోంది.