అందుకే ఇక్కడ అన్నప్రాసనలు ఎక్కువట !

అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ... అనేక విశేషాలను ఆవిష్కరించే క్షేత్రంగా గురువాయూర్ కనిపిస్తుంది. గురువు (బృహస్పతి) వాయువు కలిసి ప్రతిష్ఠించిన ఇక్కడి కృష్ణుడిని చూడటానికి వేల కళ్లున్నా తక్కువేననిపిస్తుంది.

ఇక్కడ కృష్ణుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. స్వామివారికి నిత్యం జరిగే సేవా కార్యక్రమాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి అనేక నిదర్శనాలు వున్న కారణంగా, ఆయన సన్నిధిలో తమ బాధలు చెప్పుకోవడానికీ, ఆశీస్సులు అందుకోవడానికి దేశ విదేశాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

వివిధ రకాల అనారోగ్యాలతో సతమతమైపోతున్నవాళ్లు స్వామి అనుగ్రహంతో బయటపడటానికి ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఈ క్షేత్రంలో వివాహం చేసుకున్న వారి జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతుందనే విశ్వాసం ఉండటం వలన ఇక్కడ విరివిగా వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇక 'అన్నప్రాసన'లు కూడా ఇక్కడ పెద్దసంఖ్యలో జరుగుతుంటాయి.

ఇక్కడ అన్నప్రాసన జరపడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అంటారు. శ్రీకృష్ణుడు మహా జ్ఞానసంపన్నుడు కావడం వలన ఆయన అనుగ్రహంతో పిల్లలు విద్యావంతులుగా ... విజ్ఞాన సంపన్నులుగా ఎదుగుతారని భావిస్తుంటారు. అందువలన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ చిన్నారి అన్నప్రాసన అయినా దాదాపుగా ఈ క్షేత్రంలోనే జరుగుతుంది. అలా ఈ క్షేత్రం ఆరోగ్యాన్ని ... అందమైన వైవాహిక జీవితాన్ని ... విజ్ఞానాన్ని అందించేదిగా ప్రత్యేకతను సంతరించుకుని విశిష్టమైన క్షేత్రంగా విలసిల్లుతోంది.


More Bhakti News