అమ్మతోడుంటే అసాధ్యమైనది లేదు
అనునిత్యం భవానీదేవిని ఆరాధిస్తూ ఆ తల్లి సేవలో తరించిన మహాభక్తులలో ఛత్రపతి శివాజీ ముందువరుసలో కనిపిస్తాడు. భవానీదేవిని పూజించకుండా ఆయన తన దైనందిన కార్యక్రమాలను ఆరంభించేవాడు కాదు. తాను విజయాలను సాధించడానికీ ... సనాతన ధర్మాన్ని స్థాపించడానికి కారణం ఆ అమ్మవారేనని శివాజీ చెప్పేవాడట.
సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమై అత్యంత శక్తిమంతమైన 'చంద్రహాస' ఖడ్గాన్ని ఆయనకి బహుకరించిందంటే, ఆ తల్లిపట్ల ఆయనకి గల భక్తి శ్రద్ధల స్థాయిని అర్థంచేసుకోవచ్చు. అసమానమైన దైవభక్తే కాదు ... అచెంచలమైన గురుభక్తిని కలిగివుండటం ఆయనలోని మరో ప్రత్యేకతగా కనిపిస్తుంది. శివాజీ గురువైన 'సమర్థ రామదాసు' తన పట్ల ఆయనకి గల సేవాభావం ఎలాంటిదో మిగతా శిష్యులకి తెలియజెప్పాలని అనుకుంటాడు. అందుకు తగిన సమయం రానేవస్తుంది.
ఒకసారి ఆయన శిష్యులతో కలిసి అడవిదారిలో ప్రయాణం చేస్తూ, విపరీతమైన కడుపు నొప్పితో కుప్పకూలిపోతాడు. ఆ బాధ నుంచి తనకి ఉపశమనం కలగాలంటే ఉగ్గి గిన్నెడు 'సివంగి' పాలు కావాలని చెబుతాడు. అది తమకి సాధ్యమయ్యే పనికాదని భావించిన శిష్యులు భగవంతుడిపై భారం వేసి కూర్చుంటారు. సమర్థులవారు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారని తెలిసి వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు శివాజీ. అప్పటికీ బాగా చీకటిపడుతుంది. విషయం తెలుసుకున్న శివాజీ గురువు వారిస్తున్నా వినిపించుకోకుండా ఆడసింహాన్ని అన్వేషిస్తూ బయలుదేరుతాడు.
ఒకచోట ఆయనకి సివంగి ఎదురుపడుతుంది. అది శివాజీపైకి దాడిచేయడానికి సిద్ధపడుతుంది. తన తల్లి భవానీదేవిని మనసులో తలచుకుని ఆ సివంగి నుంచి పాలను ఇప్పించ వలసిందిగా ప్రార్ధిస్తాడు. అంతే ఆ సివంగి తన సహజమైన లక్షణాన్ని కోల్పోయి సాధుజీవిలా ప్రవర్తిస్తుంది. తన నుంచి పాలు తీసుకుంటోన్న శివాజీకి అది ఒక ఆవులా సహకరిస్తుంది. సివంగి నుంచి పాలు తీసుకున్న శివాజీ అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుని తిరిగి గురువుగారి దగ్గరికి చేరుకుంటాడు. ఆపాలను సేవించిన సమర్థుల వారు వెంటనే ఉపశమనం పొందుతాడు. ఈ సంఘటన శివాజీకి గల దైవ భక్తినీ ... గురుభక్తిని మరోమారు లోకానికి చాటుతుంది.