అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించే క్షేత్రం
లోకంలో తన బిడ్డల అవసరాలను తీర్చడంలోను ... ఆపదల బారిన పడకుండా ఆదుకోవడంలోను తల్లి ప్రధానపాత్ర వహిస్తుంది. అందుకే అవసరం వచ్చినా ... ఆపద వచ్చినా ... ఏదైనా బాధ కలిగినా 'అమ్మా' అనే మాట అప్రయత్నంగా నోటివెంట వస్తుంది. అమ్మా అనే పిలుపులోని ఆప్యాయత ఇక ఎక్కాడా వినిపించదు ... కనిపించదు. అందుకే అమ్మవున్న వాడి కంటే అదృష్టవంతుడు ... ఐశ్వర్యవంతుడు లేడని అంటూ వుంటారు.
తన బిడ్డలు సంతోషంగా ఉండటం కోసం ఎంతకాలమైనా ... ఎన్ని సమస్యలతోనైనా పోరాడే శక్తిగా ... త్యాగమయిగా అమ్మ కనిపిస్తుంది. అలాంటి అమ్మలగన్న అమ్మగా ఆదిపరాశక్తిని ఈ శరన్నవరాత్రులలో పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నవరాత్రులలో అమ్మవారి దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా 'మైసూరు' ... 'విజయవాడ' వంటి శక్తి క్షేత్రాలు అమ్మవారి వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. ఈ క్షేత్రాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. 'ప్రొద్దుటూరు'లోని 'కన్యకా పరమేశ్వరి' క్షేత్రంలోను నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. దేశంలో గల కన్యకా పరమేశ్వరి ఆలయాలలో అతిపెద్దదిగా చెప్పబడుతోన్న ఈ ఆలయనికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
ఇక్కడి అమ్మవారిని అలంకరించడానికి చెన్నై నుంచి ప్రత్యేక బృందం రప్పించబడుతుంది. అమ్మవారి వైభవాన్ని చూసి తరించడం కోసం రాజస్థాన్ నుంచి ఒంటెలను ... మైసూర్ నుంచి ఏనుగులను తెప్పిస్తారు. ఇక ఇక్కడ జరిగే 'తొట్టి మెరవణి' వేడుకను దర్శించడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.